రోడ్డెక్కిన తెలంగాణ భవిష్యత్తు
న్యూస్ తెలుగు/వనపర్తి : నాడు కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కారు అని నేడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల పాఠశాలల విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో తాగునీరు రాక ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం అని చెప్పారు. పుల్లూరు గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై మాజీ మంత్రి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం బడిపిల్లల పాదయాత్రను కూడా బెదిరించి విద్యార్థులను డీసీఎంలో ఎక్కించి వెనక్కి తీసుకెళ్లడం కాంగ్రెస్ సర్కార్ నిర్భంధానికి నిదర్శనం అని చెప్పారు.సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది అని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల విద్యార్థులు 150 మంది కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలయిన ఘటన మరవక ముందే పుల్లూరు విద్యార్థులు రోడ్డెక్కడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని చెప్పారు. గురుకులాల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.(Story : రోడ్డెక్కిన తెలంగాణ భవిష్యత్తు )
