రేషన్ కార్డు లబ్ధిదారులు కల నేటికి నెరవేరింది
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రేషన్ కార్డు లబ్ధిదారులు కల నేటికి నెరవేరిందని దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీలోని బి పి ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొత్తకోట మండలానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి రేషన్ కార్డులు లేక లబ్ధిదారులు చాలా నష్టపోవడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే అని, అర్హత ఉండి రేషన్ కార్డు లేనందువల్ల నష్టపోయారని గుర్తు చేశారు. గత పాలకులు వాళ్లకు లాభం ఉన్న పనులు మాత్రమే చేశారని ప్రజలకు లాభం చేకూర్చే ఏ ఒక్క పని చేయలేదని
విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల వద్దకే అధికారులు వెళ్లి ప్రజల అవసరాలు తీర్చడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహించి అధికారులు గ్రామాలకు వెళ్లి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలు పరిష్కరించారని చెప్పారు. కొత్తకోట మండలంలో 1018 కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఉండి అదనంగా భార్య పిల్లల పేర్లు చేర్చిన కార్డులు 3322 వెరసి 4340 కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో 6443 మంది లబ్ధిదారులు నెలకు 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం లబ్ది పొందనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులో జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా రేషన్ కార్డు రానివారు ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందని అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగింది అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళల ద్వారా ఉచితంగా 200 కోట్ల ప్రయాణాలు జరిగాయని, ఇందుకు ఆర్టీసీ కి రూ. 6630 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని వాటిని అసంపూర్తిగానే వదిలేశారని వాటిని సైతం ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ. 5.00 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం మహిళలకు సహకారం అందిస్తుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితర పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల ప్రభుత్వం నెరవేర్చిందని, కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులలో కొత్తగా వచ్చిన వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డు ఉన్నవారికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుకు కార్డు తీసుకోపోకుండానే కేవలం కార్డు యజమాని వెలి ముద్ర వేస్తే బియ్యం ఇస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారులు కాశీ విశ్వనాథ్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, మదనపూర్ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story :రేషన్ కార్డు లబ్ధిదారులు కల నేటికి నెరవేరింది)
