గిరిజనులే తొలి స్వాతంత్య్ర సమరయోధులు పుస్తకావిష్కరణ
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ ఆధ్వర్యంలో సంకలనం చేసిన గిరిజనులే తొలి స్వాతంత్ర్య సమరయోధులు అనే పుస్తకాన్ని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్ ప్రొ. తంత్రవాహి శ్రీనివాసన్, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. జితేంద్ర మోహన్ మిశ్రాలు సంయుక్తంగా ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకావిష్కరణ నిర్వహించబడింది. ఈ సందర్భంగా వీసీ ప్రొ. శ్రీనివాసన్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరం లో గిరిజనుల సహకారం ఎంతైనా ఉందని భారత దేశంలో పౌరులు నేడు స్వేచ్చా స్వాతంత్రాలతో ఉన్నారంటే దానికొరకు తమ ప్రాణాన్నే పణంగా పెట్టిన స్వతంత్ర సమర యోధుల త్యాగాన్ని మనము ఎప్పటికీ మరచిపోరాదని, స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న రాంజీ గోడు, భాగోజీ నాయక్, ముక్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి గం గంటం దొర, చంద్రయ్య దొర, లక్ష్మణ్ నాయక్ తదితరుల కృషి మారువలేనిదని కొనియాడారు. ఈ పుస్తకం గిరిజనుల చరిత్ర, ధైర్యం, త్యాగాలను ప్రతిబింబించడంతో పాటు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
అనంతరం రిజిస్ట్రార్ ప్రొ. జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ గిరిజనుల సహకారం లేకుండా తెల్లదొరలను దేశం నుండి పారద్రోలడం సాధ్యమైంది కాదని, వారిలో కొందరు తమ ప్రాణాలు అర్పించగా కొందరు జైళ్ళలో మగ్గి తమ ప్రాణాలను దేశం కోసం దారపోశారు అని గిరిజన నాయకుల త్యాగాలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర వనవాసి కల్యాణ ఆశ్రమ జిల్లా అధ్యక్షుడు గీతారెడ్డి, సెక్రటరీ డా. దాసరి నారాయణ, నగర అధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, యూనివర్సిటీ లైబ్రేరియన్ డా. శంకర రెడ్డి కొల్లే తదితరులు పాల్గొన్నారు. వారు ఈ పుస్తకం లోని చరిత్రాత్మక విషయాలను వివరించి, భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పోషించిన పాత్రను యువతకు తెలియజేయాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ పుస్తకం దేశ చరిత్రలో గిరిజనుల విశిష్ట స్థానం గుర్తించేందుకు మరొక ముఖ్యమైన అడుగు అని పలువురు వ్యాఖ్యానించారు. (Story:గిరిజనులే తొలి స్వాతంత్ర్య సమరయోధులు పుస్తకావిష్కరణ )
