పులుపుల వెంకట శివయ్య వర్ధంతి సభకి ముస్తాబవుతున్న శివయ్య స్తూపం

న్యూస్ తెలుగు /వినుకొండ : స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ మార్క్సిస్టు మేధావి, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో అగ్రగణ్యుడు కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య వర్ధంతి జూలై 14వ తేదీన జరగనున్న సందర్భంగా పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో ఉన్న స్థూపాన్ని ఎరుపు రంగులతో అలంకరిస్తూ వర్ధంతి సభకి ముస్తాబు చేస్తున్నట్లు సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్టణంలో శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో వినుకొండ నియోజకవర్గ పట్టణ మహాసభలు జరుగుతున్న సందర్భంగా అదే రోజు వర్ధంతి కావడం కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వినుకొండ నియోజకవర్గానికి మొట్టమొదటి కమ్యూనిస్టు శాసనసభ్యులుగా, తర్వాత 1962లో మరొకసారి పేద ప్రజల మన్ననాలతో ఘనమైన విజయాన్ని సాధించిన కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య అని, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో రాష్ట్ర మంతట మార్క్సిస్టు బీజాలు నాటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని మొలకలెత్తించారని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన వేసిన మొలకలు మహావృక్షాలై మహోద్యమాలై భాసిల్లాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో దేశమంతటా నియోజకవర్గ జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా మన వినుకొండ పట్టణంలోని 14వ తేదీన నియోజకవర్గ మహాసభ, ఆగస్టు 7, 8 తేదీలలోపల్నాడు జిల్లా మహాసభలు జరగనున్నాయని ప్రజలందరూ కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోరుకునే వారందరూ ఈ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థూపాన్ని పరిశీలించిన వారిలో మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు, పటాన్ లాల్ ఖాన్, ఉలవలపూడి రాము, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, వూట్ల రామారావు, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జునరావు, కొండ్రముట్ల చిన్న సుభాని, ఎం సుబ్బారావు, షేక్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. (Story:పులుపుల వెంకట శివయ్య వర్ధంతి సభకి ముస్తాబవుతున్న శివయ్య స్తూపం)