యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు
న్యూస్‌తెలుగు/వనపర్తి : యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వాడకం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత సిగరెట్ కానీ మత్తు పదార్థాలు కానీ ఒక్కసారి తాగి చూద్దాం ఎలా ఉంటుందో అని ప్రయత్నం చేస్తారని అదే ఒక అలవాటుగా మారి మత్తుకు బానిసగా మారి తన జీవితంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను నాశనం చేసినవారవుతారని హెచ్చరించారు. అందుకు ఆ ఒక్కసారి కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని దాని వల్ల ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలవడంతో పాటు దొరికినప్పుడు జైలు పాలు కాక తప్పదన్నారు. వనపర్తి యువత చాలా మంచివారని ఇప్పటి వరకు ఎంతో మంది యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకొని తమ బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటున్నారన్నారు. ఇకముందు కూడా యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల వాడకం నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు లేదా రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తె వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలను సేవించడం వల్ల మన శరీరం అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలు అవుతామని, ఆసపత్రితో పాటు జైలు పాలవుతామన్నారు. అందువల్ల యువత ఎట్టి పరిస్థితుల్లోను మాదక ద్రవ్యాలను తీసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలను వనపర్తి జిల్లాలో అడుగుపెట్టనీయకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలు వాడినా లేదా ఎవరివద్దనైనా కనిపించిన చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
అనంతరం మాదకద్రవ్యాలను వాడమని, ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇస్తామని యువత చేస్తా ప్రమాణం చేయించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వాడకం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీ లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు డిఎస్పి వెంకటేశ్వరరావు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి ,డి. ఈ .ఓ అబ్దుల్ ఘని, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. (Story:యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు)
