సీఎంఆర్‌ఎఫ్ లబ్ది రాష్ట్రంలో టాప్-3లో వినుకొండ నియోజకవర్గం
43 మంది లబ్దిదారులకు రూ.55.62 లక్షల విలువైన చెక్కులు అందజేత
న్యూస్ తెలుగు/వినుకొండ : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితుల్ని ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్-3లో నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గడిచిన ఏడాదిలోనే వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 556 మంది బాధితులకు 3 కోట్ల 86 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఒక రికార్డు అన్న ఆయన అందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందుకున్న ప్రతిఒక్కరు ఆరోగ్యం బాగుపడాలని, ఆ కుటుంబా లు ఆనందంగా ఉండాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఆదివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మరికొంతమందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు రూ.55.62 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవీ ఆంజనేయులు, సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ గతంలో ఎప్పుడూ ఈ విధంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇచ్చింది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, సీఎంఆర్‌ఎఫ్‌ను మరింత బలోపేతం చేసి పారదర్శకంగా, సమర్థంగా అర్హులైన వారికే చెక్కులు అందిస్తున్నామని, ప్రతి రూపాయి సరైన వ్యక్తికి చేరేలా మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేయించడంతో పాటు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రానివి, అదనంగా అయ్యే ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల కూడా వేలాదిమందికి సీఎంఆర్‌ఎఫ్ సాయం అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రధానమంత్రి మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వశక్తులు ఒడ్డి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు సహా పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.(Story : సీఎంఆర్‌ఎఫ్ లబ్ది రాష్ట్రంలో టాప్-3లో వినుకొండ నియోజకవర్గం )

