అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/సాలూరు : ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం ఆర్.కె.బీచ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే యోగా కార్యక్రమంలో స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలని, అవసరమైతే రవాణా సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను చేకూర్చేది యోగా మాత్రమేనని వివరించారు.మక్కువ మండలం వెంగళరాయ సాగరం వద్ద గల ఏనుగుల కొండ దగ్గర మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలను చేశారు. రంగుల బెలూన్లను గాల్లోకి వదలి యోగాంధ్రకు పిలుపునిచ్చారు. ఏనుగుల కొండ ప్రాంతం చాలా మందికి తెలియదని, ఇటువంటి పర్యాటక ప్రాంతంలో యోగాను నిర్వహించు కోవడం వలన ఈ ప్రాంతంలో ఉండే ప్రకృతి అందాలు, ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు తెలిసే అవకాశం ఉందన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మీయ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లావాసులు కూడా స్వచ్ఛందంగా హాజరై యోగాలో పాల్గొనాలని కోరారు. జిల్లాకు చెందిన 28వేల మంది విద్యార్ధులు యోగాలో పూర్తిగా శిక్షణ పొంది, భారత ప్రధాని ముంగిట 108 సూర్య నమస్కారాలను ప్రదర్శించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కూర్చోనేది మన పిల్లలే కావడం మనకు గర్వకారణమని అన్నారు. ప్రస్తుత జీవనంలో ప్రతీ ఒక్కరూ బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, అటువంటి వారికి మానసిక ప్రశాంతతను చేకూర్చడమే కాకుండా వాటిని యోగా నియంత్రిస్తుందని తెలిపారు. ఇక్కడf నేర్చుకున్న ప్రతీ ఒక్కరూ తమ ఇంటిలోని కుటుంబ సభ్యులకు, పిల్లలకు యోగాను నేర్పించి అలవాటుగా చేయాలని మంత్రి సూచించారు. యోగా, క్రీడలు అలవాటుగా చేసుకోవాలని, యోగా దినచర్యలో ఒక భాగం కావాలని మంత్రి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రమోట్ చేయడమే యోగాంధ్ర లక్ష్యమని, ఆ లక్ష్యసాధన దిశగా అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించి, వాటిని ప్రమోట్ చేసే దిశగా ఏనుగుల కొండ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రకృతి సోయగాలు, సహజ సిద్ధ అందాలకు నెలవు మన్యం జిల్లా అని, అటువంటి ప్రకృతి సోయగాలతో కూడిన ప్రాంతం ఏనుగుల కొండ అని కలెక్టర్ తెలిపారు. భవిష్యతులో ఇక్కడ బోటింగ్, ట్రెక్కింగ్ వంటి పలు సదుపాయాలు కల్పిస్తూ, దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచేందుకు ఈ ప్రాంతం అనుకూలమని అన్నారు. జిల్లాలో యోగాంధ్రను బాగా చేస్తున్నారని, ఇది రోజు వారీ కార్యక్రమాల్లో ఒక భాగం కావాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు అధికారులతో కలిసి రంగుల బెలూన్లను గాల్లోకి వదలి యోగాంధ్రకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.బాస్కరరావు, ప్రోగ్రాం అధికారి డా. టి.జగన్మోహనరావు, జిల్లా పంచాయతీ అధికారి టి. కొండలరావు, ఐసిడిఎస్ పీడి డా. టి.కనకదుర్గ, ఆయుష్ వైద్యాధికారి డా. బి.సుశీల, ఆర్ డబ్ల్యు ఎస్. అంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు పెద్ద ఎత్తున విద్యార్థులు, శిక్షకులు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి)

