నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇళ్లు లేని నిరుపేదలకు అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వనపర్తి శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. వనపర్తి నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లకు గాను మొదటి దశలో 770 ఇళ్ళు మంజూరు చేయగా రెండవ దశలో 2730 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి బుధవారం మంజూరు పత్రాల పంపిణీ చేశారు. మొదటి, రెండవ దశలో మంజూరు చేసిన ఇళ్లను కలుపుకొని ఘనపూర్ మండలానికి 402, గోపాల్పేట 419, పెబ్బేరు 355, పెబ్బేరు మున్సిపాలిటీకి 143, పెద్దమందడి 376, రేవల్లి 205, ఎదుల 162, శ్రీరంగాపూర్ 266, వనపర్తి మండలానికి 453, వనపర్తి మున్సిపాలిటీకి 575, ముసాపేట 14, అడ్డకుల 60 వెరసి 3430 ఇళ్లను జిల్లా కలెక్టర్ ద్వారా ఆమోదం పొంది మంజూరు పత్రాలు జారీ చేయడం జరిగింది. మరో 70 లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం, పట్టణం లేదని చెప్పారు. ఒక్కొ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున 3500 ఇండ్లకు రూ.175 కోట్లు కేవలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ రోజు రూ.50 కోట్ల విలువగల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు స్వీకరించిన లబ్ధిదారులు 45 రోజులలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు మోసపూరితంగా తెచ్చిన ధరణి ని బంగాళాఖాతంలో పడేసి, రైతుల భూ సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం భూ భారతి చట్టం అమలు పరుస్తూ, గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ పారదర్శకంగా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్, అధికారులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారత దేశ చరిత్రలో లేని విధంగా 26 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ, సన్నబియ్యం కు 500 రూపాయలు బోనస్, ఆడ బిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 లోవు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ లో వనపర్తిలో ఉన్న శ్రీమంతులు తింటున్న సన్న బియ్యం మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల సార్ధకమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజురుకు గాను ఎమ్మెల్యే మేఘా రెడ్డి చొరవతో అదనంగా 600 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వనపర్తి మున్సిపాలిటీ, మండలంలో 1028 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్మించిన మోడల్ ఇంటిని పరిశీలించాలని, 400-600 చదరపు అడుగుల విస్తీర్ణం లో ఇండ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు.
లబ్ధిదారులు మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చూసేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని గృహ నిర్మాణం శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు కేవలం రవాణా ఖర్చుతో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తుందన్నారు. నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయలు లబ్దిదారుల ఖాతాలలో జామ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్, హౌసింగ్ డి. ఈ విటోభా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం)
