వ్యవసాయ శాఖలో రైతు సంక్షేమ విభాగాన్ని జోడించాలి
రైతుల కుటుంబాలకు విద్యా, వైద్య రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: దేశంలో కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు రైతు సంక్షేమ విభాగం కూడా కలిపి ఉంటుందని, రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో కూడా రైతు సంక్షేమ విభాగాన్ని జోడించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు అభిప్రాయపడ్డారు.
శనివారం డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డీ) లో జరిగిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ల శిక్షణ తరగతుల్లో ” రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి ” అనే అంశంపై ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ నుంచి రైతు సంక్షేమం విభాగాన్ని తొలగించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోని ప్రభుత్వంలో కూడా వ్యవసాయ శాఖలో రైతు సంక్షేమ విభాగం లేదని, దీనిని వెంటనే జోడించాలని చిన్నారెడ్డి గారు అన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అని ఉండాలని ఆయన అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అని ఉండేదని, ఇదే విధానం పక్క రాష్ట్రంలో కూడా కొనసాగుతోందని చిన్నారెడ్డి గారు గుర్తు చేశారు.
దేశానికి అన్నదాత, వెన్నెముక అయిన రైతుల కుటుంబాలకు విద్యా, వైద్యం, బస్సు ప్రయాణాలతో పాటు పలు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చిన్నారెడ్డి గారు అభిప్రాయపడ్డారు.
అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని పంటలు పండిస్తున్న రైతుల కుటుంబానికి చెందిన పిల్లలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ లో రిజర్వేషన్స్ కల్పించాలని, వైద్యంలో రాయితీ కల్పించాలని చిన్నారెడ్డి గారు అన్నారు.
వ్యవసాయ రంగంలో కూడా కృత్రిమ మేధో ( ఏ.ఐ. ) సాంకేతికత ఉపయోగంలోకి వస్తోందని, దీని వల్ల పంటలకు సోకే వ్యాధుల స్పాట్ కచ్చితంగా తెలుస్తుందని చిన్నారెడ్డి గారు తెలిపారు. వ్యవసాయ రంగం గురించి విపులంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ పాండురంగారెడ్డి, ఫ్యాకల్టీ బీ. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు . (Story:వ్యవసాయ శాఖలో రైతు సంక్షేమ విభాగాన్ని జోడించాలి)

