దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి :తాలుతరుగు పేరుతో ప్రతి క్వింటలకు మూడు నుంచి ఐదు కిలోలు దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వర్షాలు పడిన నేపథ్యంలో వనపర్తి మార్కెట్ యార్డును సిపిఐ నేతలు సందర్శించి చిట్యాలకు చెందిన రాము మరికొందరు రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులోప్రతి బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 41 కిలోలు తూకం వేసి రైతులకు నష్టం చేస్తున్నారన్నారు. వీటిని లారీలలో మిల్లులకు పంపితే అక్కడ ప్రతి క్వింటాలుకు మూడు నుంచి ఐదు కిలోలు షార్టేజ్ పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారన్నారు. శ్రీరంగాపురానికి చెందిన కొందరు మిల్లర్లు బరితెగించి ఐదు కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే లారీల నుంచి ధాన్యం దించుకుంటామని, లేదంటే తీసుకెళ్లిపొమ్మని చెప్పేస్తున్నారన్నారు. చిట్యాల కు చెందిన కొందరు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు అన్నారు. దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ధాన్యం నిలువ చేసేందుకు మిల్లర్లపై ఆధారపడకుండా ప్రత్యేక గోదాముల వసతి అధికారులు కల్పించాలన్నారు. (Story:దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఐ)
