ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి
ఇద్దరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కు అందజేత
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశంలోనే మరే రాజకీయ పార్టీకి లేనివిధంగా తెలుగుదేశానికి మాత్రమే కార్యకర్తల సంక్షేమనిధి ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కుటుంబంగా భావించే సంస్కృతి తెలుగుదేశం సొంతమ న్నారు. పార్టీ అధిష్ఠానంతో పాటు నాయకులంతా కూడా వారికి అండగా ఉంటారన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సోమవారం రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. వినుకొండ మండలం చీకటీగలపాలేనికి చెందిన అన్నెం బ్రహ్మారెడ్డి, బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన ఖాసింసా ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు జీవీ ఆంజనేయులు బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కార్యకర్తలకు ఏం కష్టం వచ్చినా కుటుంబ పెద్దల్లా ఆదుకుంటున్నారి అన్నారు. వ్యక్తిగత శ్రద్ధతో పాటు వ్యవస్థాగతంగా కార్యకర్తలకు భరోసా ఉండాలనే బీమా సదుపాయం కూడా ఏర్పా చేశారన్న జీవీ ఏటా ఆ ప్రీమియం మొత్తం పార్టీనే చెల్లిస్తుందని చెప్పారు. కార్యకర్తల సంక్షేమనిధి సారథిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టాక ఇలాంటి పలు విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకున్నారని తెలిపారు. కోటి మంది కార్యకర్తలకు ఒకేసారి బీమా కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం’ అని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదంలో కార్యకర్త మరణిస్తే 15 రోజుల్లో ఆ సమాచారాన్ని తెలపాలని, 30 రోజుల్లో ధ్రువపత్రాలు తీసుకొని నామినీ స్వయంగా వినుకొండలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పార్టీ సభ్యత్వం తీసుకొన్న కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మానుకొండ శివప్రసాద్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. (Story:ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి)

