కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్నది సాధించవచ్చు
మదర్స్ ల్యాప్ విద్యార్థులను సన్మానించిన ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి: విలువైన సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే మీరు అనుకున్నది సాధించవచ్చని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా శనివారం విద్యార్థులను ఎస్పీ రావుల గిరిధర్ సన్మానించి అభినందించారు. ఈ పాఠశాలకు చెందిన కే.సింధుశ్రీ 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి వనపర్తి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కృష్ణారెడ్డి 538, అమృత 534 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. 14 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వామి వివేకానంద లాంటి మహాత్ములను ఆదర్శంగా తీసుకొని చదువుతోపాటు సేవా భావం కలిగి ఉండాలని సూచించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, చదువుతోపాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్స్ ల్యాప్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఎండి.అబ్దుల్ ముబీన్ పాల్గొన్నారు. (Story:కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్నది సాధించవచ్చు)

