వైసీపీ వర్గీయులపై పెరుగుతున్న టిడిపి దాడులు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో, వైసీపీకి చెందిన వర్గాలపై టిడిపి దాడులు ఎక్కువైపోయాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చూస్తుంటే చీప్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారా, అని అనుమానించాల్సి వస్తుందని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో వైసిపి నేతలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి వర్గీయులు దాడులు చేస్తూనే ఉన్నారని బొల్లా ఆవేశంగా మాట్లాడారు. శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో చికెన్ షాప్ నిరవహిస్తున్న ఎస్టి కుటుంబాలకు చెందిన చికెన్ షాపుపై, వేల్పూరు, గంట వారిపాలెం కు చెందిన టిడిపి వర్గీయులు, ప్రోక్లైనర్ తో దాడి చేసి షాపును ధ్వంసం చేసి, ఎస్టి కుటుంబాలను గాయపరచారన్నారు. ఈ దాడిలో 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లగా, ఈ దాడిని ఇద్దరు బాధిత మహిళలు సెల్ ఫోన్ తో చిత్రీకరిస్తుండగా వారిపై కూడా దాడి చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ సెల్ఫోన్ లాక్కున్నారని బొల్లా వివరించారు. సెల్ ఫోన్లు పోలీసుల వద్దకు చేరినప్పటికీ బాధిత కుటుంబాలకు సెల్ ఫోన్లు ఇవ్వలేదన్నారు. చికెన్ దుకాణం నిర్వహణకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ టిడిపి వర్గీయులు అధికార బలంతో దాడులు జరిపారన్నారు. అలాగే ఈపూరు మండలం బొమ్మరాజు పల్లి లో వైసిపి అభిమాన యువకుడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించి తీవ్రంగా కొట్టారన్నారు. బొల్లాపల్లి మండలం పలుకూరులో 70 ఏళ్ల వృద్ధుడు అరుగుపై పడుకుని ఉండగా ఊరంతా వలస వెళ్లారు కదరా నీవు ఎందుకురా ఇక్కడ అంటూ టిడిపి వర్గీయులు దాడి చేశారన్నారు. కొచ్చర్ల గ్రామంలో ఘర్షణ చూస్తున్న 14 ఏళ్ల బాలుడిని టిడిపి వర్గీయులు తీవ్రంగా కొట్టారన్నారు. వినుకొండ పట్టణంలో కూడా వైసిపి కార్యకర్తలను ఏదో ఒక నెపంతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా కొడుతూ సాయంత్రానికి పంపించి వేస్తున్నారని, అలాగే గుమ్మనంపాడు గ్రామంలో వైసీపీకి ఓటేశాడని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇలా వైసిపి వర్గీయులపై, టిడిపి వారు దాడులు చేస్తూనే ఉన్నారన్నారు. క్యాబినెట్ హోదాలో ఉన్న చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గ్రామాల్లో జరిగే సంఘటనలన్నీ తెలిసినప్పటికీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని బొల్లా మండిపడ్డారు. ఇక పట్టణంలో పది మాసాలుగా ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. తన హయాంలో వంద పడకల ఆసుపత్రి మంజూరై స్థలం కూడా కేటాయింపు జరిగితే, ఎమ్మెల్యే జీవీ ఆ ఊసే ఎత్తడం లేదు అన్నారు. ఆనాడు ఎన్ఎస్పీలో కూరగాయల మార్కెట్ కు షాపులు వేలం పాటల నిర్వహిస్తుంటే, జీవి ఆంజనేయులు అడ్డు తగిలి తాను గెలిస్తే షాపులు ఊరికే కేటాయిస్తామని వేలం పాటలు అడ్డుకున్నారని బొల్లా అన్నారు.. తాను ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు మాసాలకే 50 ఎకరాలు గా ఉన్న సింగర చెరువును 200 ఎకరాలు గా విస్తీర్ణపరిచి పూర్తి స్థాయిలో నీటిని నింపుతూ నేటి వరకు త్రాగునీటి సమస్య లేకుండా చేశామని ఈ సందర్భంగా బొల్లా అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో జరిగే టిడిపి దాడులను ఎదుర్కొంటామని, జైలుకు వెళ్లేందుకు అయినా సిద్ధంగా ఉన్నామని, అలాగే గ్రామాలలో మద్యం షాపులు వీధికో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరో సరుకులు లభించడం లేదని, ఇప్పటికైనా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కక్షపూరిత రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బొల్లా కోరారు…….
…… వైసిపి కన్వీనర్లను సన్మానించిన బొల్లా……..
వైసిపి కన్వీనర్లుగా నియమితులైన కొత్తమాసు వెంకట సాంబశివరావు వినుకొండ, దండు చెన్నయ్య వినుకొండ రూరల్, ముప్పురాజు వెంకటేశ్వర్లు నూజండ్ల, కొండవర్జు నాగేశ్వరరావు ఈపూరు, కాకర్ల పెద్ద నారాయణ రెడ్డి బొల్లాపల్లి, బోడెపూడి వెంకటేశ్వర్లు (కొండలు) శావల్యాపురం ఈ సందర్భంగా బొల్లా అభినందించారు. నియామకాలు జరిగినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నూతనంగా నియమితులైన వైసీపీ కన్వీనర్లు గ్రామాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచాలని కోరారు……
……… ఉగ్రవాదుల దాడిని ఖండించిన బొల్లా……
అలాగే మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడులు తీవ్ర దిగ్భ్రాంతిని కలుగచేసాయని, ఈ దాడిలో పలువురు మృతి చెందగా కొంతమంది పర్యాటకులు గాయాల పాలు కావడం తీవ్ర బాధాకరం అని అన్నారు. ఉగ్ర మూకల రూపంలో ఉన్న మత ఉన్మాద తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో అస్థిరత సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పర్యాటకులపై ఉగ్రదాడులకు పాల్పడడం చాలా బాధాకరం అని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్, యార్డు మాజీ చైర్మన్ అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, రాజా, బేతం గాబ్రియేలు, తదితరులు పాల్గొన్నారు.(Story : వైసీపీ వర్గీయులపై పెరుగుతున్న టిడిపి దాడులు )