విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రతిఫలం పది ఫలితాలు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జీవీ అభినందనలు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి గడిచిన పది నెలల్లో విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ప్రతిఫలమే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈసారి అనేక మంది కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా కఠోర శ్రమ, అంకితభావంతో అత్యధిక మార్కులతో సర్కారు విద్యావ్యవస్థ బలాన్ని చాటి చెప్పారన్నారు. వీరంతా రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గురువారం ఈమేరకు అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 591 మార్కులు సాధించిన వినుకొండ, విఠంరాజుపల్లె జడ్పీ బాలికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థినులు జె. ఖతిజ, విప్పర్ల చాతుర్య, చీకటీగలపాలెం ఆదర్శ పాఠశాల విద్యార్థి టి. సాయిరాంకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన ఫలితాలు సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈపూరు మండలం కొండ్రముట్ల జడ్పీ ఉన్నత పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ఆయన ప్రశంసలు తెలియజేశారు. పల్నాడు జిల్లా గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 18వ స్థానంలో నిలిచినప్పటికీ, ఈ ఏడాది 11వ స్థానానికి ఎగబాకడం గర్వకారణమన్నారు. ఈ పురోగతి జిల్లా విద్యావ్యవస్థలో జరుగుతున్న సానుకూల మార్పులకు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల కృషి ఫలితంగా ఇది సాధ్యమైందన్నారు. (Story:విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రతిఫలం పది ఫలితాలు)