పేద ప్రజలకు సన్న రకం బియ్యం పంపిణీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : జూబ్లీ హిల్స్ లో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు ఉన్నత వర్గాల ప్రజలు తినే సన్న బియ్యాన్ని సామాన్య ప్రజలు సైతం తినాలి అనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని 3.10 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం రేవల్లి మండలములోని పర్వతాలు అనే లబ్ధిదారుని ఇంట్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలసి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అందులో భాగంగానే చౌక ధర దుకాణం ద్వారా పేద ప్రజలకు సన్న రకం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పర్వతాలు ను శాసన సభ్యులు ప్రశ్నించగా సన్న బియ్యం అన్నం ఎంతో రుచికరంగా ఉందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. రుచికరమైన భోజనం పెట్టినందుకు పర్వతాలకు జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ లక్ష్మి, ఇతర మండల అధికారులు తదితరులు ఉన్నారు. (Story:పేద ప్రజలకు సన్న రకం బియ్యం పంపిణీ)