అర్జీలు పరిష్కారాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజాదర్బార్‌కు వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు తీర్చడమే కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని, ఆ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. వినుకొండ పట్టణంలోని చీఫ్‌విప్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను నేరుగా విన్నా రు. సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ. రెవెన్యూ, డ్రైనేజీ, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా వినతులు వచ్చాయన్నారు. మొత్తం 94 అర్జీలు స్వీకరించామని తెలిపారు. వీటి అన్నింటినీ పరిశీలించి, పరిష్కారాలు సూచించామన్నారు. నీటి సమస్యలు, డ్రైనేజీ బ్లాకేజీపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి భూ రికార్డులు సరిచేయడంపైనా వేగంగా స్పందించాలన్నారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల్లో పల్నాడు ప్రాంత కరవు తీర్చడం ప్రధానంగా ఉందని.. ప్రతి గ్రామంలో సాగునీరు, తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజల నమ్మకమే కూటమి ప్రభుత్వం బలమని, వారి సమస్యలు పరిష్కరించ డం ద్వారా వినుకొండ నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.(Story :అర్జీలు పరిష్కారాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలి )