పోలవరం-బనకచర్లతో చంద్రబాబు భగీరథ ప్రయత్నం
పోలవరం-బనకచర్ల జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుపై చీఫ్ విప్ జీవీ హర్షం
న్యూస్ తెలుగు/వినుకొండ : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారని, కరవు రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో ఇది తొలి అడుగుగా ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన జలహారతి కార్పొరేషన్‌తో దశాబ్దాల దాహార్తిని తీర్చే ప్రగతి యజ్ఞానికి నాంది పలికారన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు కోసం కంపెనీల చట్టం కింద వందశాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్‌పై ఏర్పాటుపై మంగళవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో స్పందించారు. పల్నాడు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లో తరతరాలుగా పీడిస్తోన్న కరవును తీర్చే బృహత్తర ప్రాజెక్టుగా పోలవరం-బనకచర్ల అనుసంధానం రూపుదిద్దుకుంటోందన్నారు. అలాంటి గొప్ప లక్ష్యం సాధన కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పల్నాడు ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. పోలవరం-బనకచర్ల లింక్‌లో భాగంగా బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపడతారని, దానిద్వారా తమ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు సమస్యల నుంచి విముక్తి లభించడంతో పాటు భూగర్భజలాలు కూడా భారీగా పెరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల జలాలతో రెండు పంటలు పండించుకుంటూ పల్నాడు ప్రాంతం పచ్చతోరణంగా మారనుందన్నారు. ఇవే అంశాల్లో అయిదేళ్ల వైకాపా పాలనలో పల్నాడు, వినుకొండ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు దాహార్తిని తీర్చే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందని, రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టబోయే పోలవరం- బనకచర్ల భారీ ప్రాజెక్టు పూర్తయితే, కరవు ప్రాంతాలైన పల్నాడు, ప్రకాశం, రాయలసీమలకు నీటి సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ రూపంలవో రాష్ట్ర ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చొరవకు పల్నాడు ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు.(Story : పోలవరం-బనకచర్లతో చంద్రబాబు భగీరథ ప్రయత్నం )