ప్రజలందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి:ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కొత్తకోట మండల పరిధిలోని ముమ్మాల్లపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ముమ్మాల్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో నెలకొన్న సమస్యలను గురించి తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ అదే గ్రామానికి చెందిన అడ్డాకుల చరమందా, లక్ష్మి గృహాన్ని సందర్శించి, వారికి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న సన్నబియ్యం అందిందా లేదా అని ఆరా తీశారు. అప్పటికే సన్న బియ్యం తీసుకున్నామని సదరు కుటుంబ సభ్యులు బదులిచ్చారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి ఇంట్లోనే ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని స్థానికులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గ్రామాల్లో ప్రజలు అందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో, కలిసికట్టుగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎవరైనా కుల వివక్ష చూపించడం జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలు కూడా నాణ్యమైన ఆహారం తినాలనే ఆలోచనతోనే ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకు వచ్చిందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఉన్న 19వ నెంబర్ రేషన్ షాపును కలెక్టర్ సందర్శించి రేషన్ కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలని సూచించారు.
కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగరాజు గంధం, ముమ్మాళ్ళపల్లి గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.(story:ప్రజలందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి)