ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పరిచి మెరుగైన వసతులు కల్పిస్తాం
పల్నాడు డిపిటిఓ ఎం.మధు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ ఆర్టిసి డిపోను అత్యంత ఆధునీ కరంగా విస్తీర్ణపరిచి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా డిపిటిఓ ఎం.మధు అన్నారు. గురువారం 2 నూతన బస్సులు ప్రారంభించేందుకు వినుకొండ డిపోకు వచ్చిన ఆయన విశాలాంధ్రతో మాట్లాడారు. బస్టాండ్ విస్తీర్ణపరిచి ఆధునికరించినందుకు 17 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి అంచనాలను ఆర్టిసి ఎండి వద్దకు పంపినట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పనులు వెంటనే ప్రారంభించడం జరుగుతుందని, నిధులు విడుదలపై స్థానిక చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కు కూడా మరోసారి వివరించామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి వెంటనే నిధులు విడుదల చేసేటట్లు చూస్తానని హామీ ఇచ్చారని మధు తెలిపారు. వినుకొండ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే షెడ్యూల్ బస్ సర్వీసులు కొన్ని ఆపుతున్నారని విశాలాంధ్ర ప్రశ్నించగా. వాస్తవమేనని కండక్టర్లు డ్రైవర్లు కొరత కారణంగా కొన్ని సర్వీసులు ఆపడం జరుగుతుందన్నారు. కొత్త డ్రైవర్లను కండక్టర్లను తీసుకుంటున్నామని బదులిచ్చారు. అలాగే డిఎం కార్యాలయంలో సూపర్వైజర్ల వింగ్ లో, గ్యారేజీలో సిబ్బంది కొరత ఉందని, ఆ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్యారేజి డీజిల్ బంకులో ఆయిల్ నిల్వ వాడకాలపై లెక్కలు ఆరా తీశారు. కాగా గత 2023 ఫిబ్రవరి మాసంలో తొమ్మిది వేల లీటర్ల డీజిల్ గోల్మాల్ పై విశాలాంధ్ర ప్రశ్నించగా, అప్పటి అధికారులపై చర్య తీసుకున్నారని ఆ వ్యవహారం అంతా ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారించడం జరిగిందని అన్నారు. అలాగే బస్టాండ్ ఆవరణలో టాయిలెట్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ వాటర్ పూర్తిస్థాయిలో సరఫరా అయ్యేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. డి పి టి ఓ మధుతోపాటు డిపో మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పరిచి మెరుగైన వసతులు కల్పిస్తాం)