ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్న కూటమి ప్రభుత్వం
వినుకొండలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చేరువ చేయడమే కాదు విద్యుత్ వాహనాల వైపు సంస్థను నడిపించడం ద్వారా భవిష్యత్‌లో ప్రజలపై ఛార్జీల భారం, కాలుష్యం సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2కొత్త బస్సులను గురువారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ-విజయవాడ ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు.. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాల దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే వినుకొండ డిపోలో 20కి పైగా డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఇంద్రా బస్సులు ప్రవేశపెట్టాని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 1489 కొత్త బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. త్వరలో మరో 1400 బస్సులు రానున్నాయన్నారు. ఈ సందర్భంగానే ఆర్టీసీపై జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు చీఫ్ విప్ జీవీ. వాళ్లు 4సార్లు పెంచి ప్రజలపై భారం మోపినా, సామాన్యులకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని, కార్మికుల్ని ఆదుకోలేదు, డిపోలను మెరుగుపరచలేదన్నారు. పైగా ఆస్తులను అమ్మేందుకు సిద్ధమయ్యారని , ప్రజలు ఓడించకపోయి ఉంటే మొత్తం తాకట్టుల్లో పెట్టేసేవారన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో పల్లె వెలుగు బస్సులు పెంచడం, విద్యార్థులకు సమయానుగుణ సర్వీసులు అందించడం, డీజిల్ ఖర్చు తగ్గించేందుకు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. వినుకొండలో కొత్త డిపో నిర్మాణానికి రూ.17 కోట్లు అవసరమని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీ ఎండీ సమక్షంలో అందుకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం సిద్ధమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డా. దస్తగిరి, రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య, కూటమి నేతలు యార్లగడ్డ లెనిన్ కుమార్, పి.వి. సురేష్ బాబు, పి. దాసయ్య, పల్నాడు జిల్లా డిపిటిఓ. ఎం. మధు, డి.ఎం. కె.నాగేశ్వరరావు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎస్కే కాజా, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్న కూటమి ప్రభుత్వం)