ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజాసేవ చేసే భాగ్యం అందరికీ దక్కదని, అలాంటి అవకాశాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.జిల్లా రెవెన్యూ విభాగంలో ప్రస్తుతం ఐ సెక్షన్ సూపరిండెంట్గా విధులు నిర్వహిస్తున్న నాయబ్ తహసిల్దార్ బక్షి శ్రీకాంత రావు ఉద్యోగ విరమణ సందర్భంగా దంపతులకి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య సహా శ్రీకాంతరావు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహోద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగ విరమణ సందర్భంగా శ్రీకాంత్ రావుని కలెక్టర్, అదనపు కలెక్టర్ల తోపాటు, సన్నిహితులు, సహోద్యోగులు శాలువాలతో సత్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజాసేవ చేసే అదృష్టం అందరికి ఉండదని, ఆ అవకాశం దక్కిన వారు దాన్ని సద్వినియోగం చేసుకొని సేవ చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీకాంత రావు తన ఉద్యోగాన్ని క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో నిర్వర్తించారన్నారు. శ్రీకాంత రావు నుండి వచ్చే ఫైల్ ఏదైనా తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంటుందని, చాలా మంచి నైపుణ్యత, అనుభవం కలిగిన ఉద్యోగి అని కొనియాడారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీ ఇవ్వడానికి వచ్చే బాధితులతోనూ ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. పెండింగ్ ఫిర్యాదుల స్టేటస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ పొందుతున్నారని చెప్పడం బాధగానే ఉందని అన్నారు. శ్రీకాంతరావు ఉద్యోగ విరమణ తర్వాత తన తదుపరి జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ శ్రీకాంత రావు చాలా మృదుస్వభావి అని, పనిని ఎంతో పద్ధతిగా చేస్తారని చెప్పారు. ఆయనకు అన్ని విషయాల పైన అవగాహన ఉందని అన్నారు. ప్రజావాణి అర్జీలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు.అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య మాట్లాడుతూ శ్రీకాంత రావు సమయపాలన కలిగిన వ్యక్తి అని, ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.వీరితోపాటు కార్యక్రమానికి విచ్చేసిన వారంతా శ్రీకాంత్ రావు విధుల్లో భాగంగా చేసిన ప్రజాసేవ గురించి కొనియాడారు.కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ రావు సన్నిహితులు, పాత్రికేయులు, సహోద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలి )