పునరావాస ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలి
ఐటీడీఏ పీవోకు ముస్లిం సోదరుల విజ్ఞప్తి
న్యూస్ తెలుగు/చింతూరు : పోలవరం ముంపులో భాగంగా తమకు పునరావాసం కల్పించే ప్రాంతంలో మసీదు, ఈద్గా నిర్మించడంతో పాటు శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని చింతూరు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు శుక్రవారం వారు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో అపూర్వభరత్ను కలిసి వినతిపత్రం అందచేసారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ చింతూరులో ప్రస్తుతమున్న మసీదు పోలవరం ముంపుకు గురవుతోందని, ప్రభుత్వం పునరావాసం కల్పించే ప్రాంతంలో ముస్లింల కోసం మసీదు నిర్మించాలని అన్నారు.మసీదు నిర్మించే ప్రాంతానికి సమీపంలోనే ముస్లింలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, దీనివలన నమాజు ఆచరించేందుకు అనువుగా వుంటుందని వారు తెలిపారు. దీనిపై స్పందించిన పీవో మాట్లాడుతూ ముస్లిం సోదరుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పునరావాస ప్రాంతంలో మసీదు, ఈద్గా నిర్మాణాలతో పాటు శ్మశానవాటికకు స్థలం కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎస్టీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు సయ్యద్ కిఫాయత్, మొహమ్మద్ జిక్రియా, ఆయుర్వేద వైద్యుడు జమాలాఖాన్, ఇమాంలు ఎజాజ్ అహ్మద్, ముర్షీద్, దస్తగిరి, సుభానీ, ఆసిఫ్, అయ్యూబ్, జిక్రియా పాల్గొన్నారు.(Story : పునరావాస ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలి )