ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో ఉండాలి: జీవీ ఆంజనేయులు
వినుకొండలో చీఫ్ విప్ జీవీ ప్రజా దర్బార్ కి విశేష స్పందన
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, నినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాల్సిన అవసరం ఉందన్నారాయన. అదే స్ఫూర్తితో ఇకపై ప్రతి బుధవారం వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో బుధవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మట్లాడారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాధనంతో జీతాలు తీసుకునే ప్రతిఒక్కరు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వినతుల్లో వచ్చే ప్రతిసమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజలంతా ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యంతో అధికారంలోకి తెచ్చారో దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమవద్దకు వచ్చే అర్జీలను స్కాన్ చేసి అధికారికులకు కూడా పంపిస్తున్నామని తద్వారా రికార్డులు పక్కాగా ఉండి యంత్రాంగంలో కూడా జవాబుదారీతనం వస్తుందని ఆశిస్తు న్నామన్నారు. ప్రజాదర్బార్ నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తామందరికీ ఆదర్శంగా పేర్కొన్నారు. పంచాయతీ సర్పంచ్‌లు, వీఆర్వోలు, మండలస్థాయి అధికారులు కూడా ఇకపై ప్రజాసమస్యల పరిష్కారంలో భాగం కావాలని సూచించారు. ఇలా ప్రజల అర్జీల ద్వారా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున్ రావు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు)