మూడేళ్లలో పల్నాడులో
ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తాం
తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకు మంచినీటి సరఫరా ట్యాంకర్లు
రేమిడిచర్లలో తాగునీటి సరఫరా ట్యాంకర్లు ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : మూడేళ్లలో పల్నాడు జిల్లాలో నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికీ సమృద్ధిగా రక్షిత మంచినీరు ఇస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి, వరికెపూడిశెల, వాటర్‌గ్రిడ్, జల్‌జీవన్ మిషన్ చేయడ ద్వారా నీటి కరవుమాట రానివ్వమన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లను సోమవారం సాయంత్రం రేమిడిచర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. 16 ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ 140 ట్రిప్పుల చొప్పున 3 నెలల పాటు తాగునీటిని సరఫరా చేయనున్నారు. అందుకు గాను రూ.82 లక్షలు వ్యయం కానుంది. అనంతరం మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న 17 గ్రామాల్ని గుర్తించి ఆర్‌డబ్ల్యూఎ స్ అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడిన 30 ట్యాంకర్లు మంజూరు చేయించామన్నారు. వాటిల్లో 16 ప్రారంభిస్తున్నామని, 2, 3 రోజుల్లో మిగిలినవీ అందుబాటు లోకి వస్తాయన్నారు. ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. నిజానికి తెలుగుదేశం గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన వాటర్‌గ్రిడ్ పూర్తయి ఉంటే ఈ దుస్థితే వచ్చేది కాదన్నారు. కానీ నాడు నిధులు ఇచ్చి, పనులు మొదలు పెట్టినా జగన్ అన్నీ ఆపేశారని వాపోయారు. నాడు వినుకొండ, గురజాల, మాచర్ల నియోజక వర్గాలకు 600కోట్లు పైగా నిధులిచ్చి, పనులు మొదలు పెట్టామని గుర్తు చేశారు. జల్‌జీవన్ మిషన్‌లో కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వ పనులు ఆపేశారని మండిపడ్డారు. ఆ లోపాలు సరిచేసేలా ప్రస్తుతం జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా కేంద్రం రూ. 18వేల కోట్లు ఇస్తే.. చంద్రబాబు మ్యాచింగ్ గ్రాంట్ రూ. 2,800 కోట్లు కేటాయించారన్నారు. ఈ ఏడాదే పనులు ప్రారంభం అవుతాయని..మూడేళ్లలో ట్యాంకర్లకి టాటా చెప్పొచ్చన్నారు. పల్నాడు జిల్లాలో మొదటి విడతో రూ.200కోట్లతో 536 పనులు… రెండవ విడత రూ.298కోట్లతో 519 పనులు జరుగుతాయని తెలిపారు. సాగునీరు కోసం గోదావరి పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టారని.. పల్నాడు, రాయలసీమను సస్యశ్యా మలం చేయబోతున్నారన్నారు. 5 నదుల అనుసంధానంతో కరవులేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.30వేలకోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. బొల్లాపల్లి జలాశయం పూర్తి అయితే పల్నాడు కరవు తీరి భూగర్బ జలాలు పెరుగుతాయన్నారు. వరికెపూడిశెల కోసం కూడా చంద్రబాబు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వినుకొండ పట్టణానికి కూడా రూ.161 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు తీసుకుని వచ్చామని… ఇవన్నీ పూర్తి చేయడమే జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు చీఫ్ విప్ జీవీ. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.(Story : మూడేళ్లలో పల్నాడులో ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తాం)