శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర
న్యూస్‌తెలుగు/వనపర్తి : శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర అని, కాబట్టి పోలీసులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ మలక్పేట, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వీరితోపాటు రాష్ట్ర బాలల సంరక్షణ కమిటీ సభ్యురాలు అపర్ణ, ఐఎంఏ అధ్యక్షులు బాబు, యశోద ఆసుపత్రి జనరల్ సర్జన్ శ్రావ్య సింధు తదితరులు వేదికపై హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర అని, కాబట్టి పోలీసులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా మనకి ఏవైనా రోగాలు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతామని చెప్పారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా మిషన్ మధుమేహ, టీబీ వంటి కార్యక్రమాలతో ప్రజలందరికీ పరీక్షలు చేసి వాటిపై ముందస్తుగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంపు ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి శ్రమిస్తారని, వారికి ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించారని కొనియాడారు. అడిగిన వెంటనే వైద్య రంగానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. వనపర్తి జీజీహెచ్ కు, ఎం సి హెచ్ కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని పెబ్బేరు కు 30 పడకల ఆసుపత్రి, వనపర్తి లో 500 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.
జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు పరచడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు ఐరన్ హ్యాండ్ ఆఫ్ ద స్టేట్ అని పేర్కొన్నారు. పోలీసులకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులో పరీక్షలు చేయించుకున్న తర్వాత పోలీసులకి ఏమైనా సమస్యలు నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న వైద్య శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలో పోలీసు శాఖ బలోపేతానికి ఎంతో సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఏఆర్ విభాగానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ నిర్మాణానికి అడిగిన వెంటనే రూ. 10 లక్షలు మంజూరు చేశారని, అదేవిధంగా డిఎస్పి భవనానికి కూడా సహకారం అందించారని తెలిపారు. జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కూడా కలెక్టర్, ఎమ్మెల్యే సహకరిస్తున్నారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఏదైనా సాధించగలమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేగారెడ్డికి పోలీసు శాఖ తరఫున శాలువా కప్పి సన్మానం చేశారు. వారితోపాటు రాష్ట్ర బాలల సంరక్షణ కమిటీ సభ్యురాలు అపర్ణ, ఐఎంఈ అధ్యక్షుడు బాబు, డాక్టర్ ఇంద్రనిల్, యశోద ఆసుపత్రి జనరల్ సర్జన్ ని కూడా సన్మానించారు. కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఉమామహేశ్వర్, సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు శాఖ సిబ్బంది, వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర)