వేసవి తాగునీటి సమస్యలకు తక్షణమే పరిష్కారాలు చూపాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, వేసవి దృష్ట్యా సాధ్యమైనంత మేరకు ముందే మేల్కొని చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం దోమలగుండం, రేమిడిచర్ల, గండిగనుమల, అయ్యన్నపాలెం గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందిగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్న ఆయన ఆ మేరకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో 16 పంచాయతీల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తాగునీరు అందించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులతో ఫోన్ లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. తాగునీటికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కోరారు. అవసరాల మేరకు తాగునీరు సరఫరా అవుతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. (Story : వేసవి తాగునీటి సమస్యలకు తక్షణమే పరిష్కారాలు చూపాలి)