భూకబ్జా దారులను రాజకీయ పార్టీల నుండి బహిష్కరించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : భూ కబ్జాల మాఫియాలను కూకటి వేళ్ళతో పెకిలిస్తేనే ప్రభుత్వ ఆస్తులకు,భూములకు రక్షణ ఉంటుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతూబ్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఏ. రవీందర్ అన్నారు. ఆత్మకూరు పట్టణంలో అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపివేయాలని, రోడ్డును కబ్జా పెట్టిన మాజీ ఎంపీపీ బంగారు శీను పై చర్యలు తీసుకోవాలని,అక్రమార్ధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న సిపిఐ నిరవధిక ఆందోళన బుధవారానికి ఏడవ రోజుకు చేరింది.సిపిఐ నిరవధిక నిరసన శిబిరంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యం.డి.కుతూబ్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఏ. రవీందర్ మాట్లాడుతూ:-ఆత్మకూరు పట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులపై రాజకీయాల మాజీ తాజా ప్రజాప్రతినిధుల ముసుగులో అధికారులతో చీకటి ఒప్పందాలతో తప్పుడు పద్ధతుల్లో కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు సృష్టిస్తూ రాజకీయ పదవులకే మచ్చ తెస్తున్నారని అన్నారు.ఇలాంటి రాజకీయ నాయకులపై ఆయా పార్టీల అధినేతలు పార్టీల నుండి బహిష్కరిస్తేనే ప్రజలకు రాజకీయాలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్డును ఆక్రమిస్తున్న మున్సిపల్ కమిషనర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా కబ్జాదారులకే సహకరించడం అత్యంత బాధాకరమని అన్నారు. ఎక్కడైనా పొరపాటున పేదలు ఫీటు జాగా జరిగి కడితేనే పారలు సలికేలు తట్టలు పనిముట్లు లాక్కొని నానా ఇబ్బందులకు గురిచేసే అధికారులు ఇప్పుడు ఎవరి కాసుల కౌగిలిలో సేద తీరుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అక్రమ కట్టడాలు ఆపే వరకు అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మోష,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నాయకులు రామచంద్రి, సౌలు, తిరుపతి,దుర్గన్న, హనుమంతు, వినోద్, నారాయణ, శుభాన్, పెంటప్ప, రాములు, ఆదాం, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.(Story : భూకబ్జా దారులను రాజకీయ పార్టీల నుండి బహిష్కరించాలి)