సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం
ఏవో వరలక్ష్మి
న్యూస్ తెలుగు /వినుకొండ : రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్వేయమని మండల వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి అన్నారు. వినుకొండ సమీపంలోని పెదకంచెర్ల రైతు సేవా కేంద్రంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు . రైతులందరూ సామూహికంగా ఒకేసారి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందు వినియోగించడం వలన వాటిని నివారించుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా బ్రోమోడయోలిన్ మందును వంద శాతం రాయితీ పై సరఫరా చేయడం జరుగతుందన్నారు. బ్రోమోడయోలిన్ విషపు ఎర వాడేటప్పుడు విషం కలపని ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేయనవసరం లేదన్నారు. గట్లపై గడ్డి కలుపు లేకుండా శుభ్రపరచుకోవాలన్నారు. గట్ల సంఖ్యను పరిమాణాన్ని వీలయినంత వరకు తగ్గించడం ద్వారా ఎలుకల నివాస స్థావరాలను తగ్గించవచ్చు అన్నారు. ఒక్కొక్కరుగా మందు పెడితే ఎలుకలు పక్క పొలంలోకి వలస వెళ్లి, మందు ప్రభావం తగ్గాక తిరిగి వచ్చి పంట నష్టం కలిగిస్తాయన్నారు. ఎలుకల మందు శనగ నూనె కలిపిన నూకలను పేపర్ లో చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ఎలుకల సజీవ బొరియలలో వేసి, బొరియలను మట్టితో పూడ్చి పెట్టాలన్నారు. మందు తిన్న ఎలుకలు రక్తం గడ్డకట్టి కదలలేని స్థితికి చేరి చనిపోతాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దుర్గా వరప్రసాద్ నాయక్, రైతులు, పాల్గొన్నారు.(Story : సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం)