ఘనంగా బడాయాత్ర
న్యూస్ తెలుగు /చింతూరు : అల్లూరిసీతారామ రాజు చింతూరు మండలం లోని మోతు గూడెం పరిధిలో ఉన్నటువంటి పొల్లూరు జలపాతం వద్ద మన్యంకొండ జాతర( బడాయాత్ర ) పురస్కరించుకొని పొల్లూరు జలపాతం వద్ద సోమవారం వనదేవతలకు మంగళస్నానం, ప్రాణప్రతిష్ట,కార్యక్రమాలు నిర్వహించారు.రెండేళ్లకు ఒకసారి ఒరిస్సా ప్రభుత్వం అధికారకంగా నిర్వహించే మన్యంకొండ జాతరలో వనదేవతలకు ఇలా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఒడిస్సా నుంచి వనదేవతలను ప్రత్యేక పడవలో సీలేరు నది దాటించి అర్చకులు అయినవిల్లి కుమార్ స్వామి శర్మ ఆధ్వర్యంలో ఏపీ జెనకో మరియుపోలీస్ ఉన్నత అధికారులు వనదేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాదిమంది భక్తులు మేళతాళాల మధ్య సాంప్రదాయబద్ధంగా ఘటం రూపాలలో ఉన్న వన దేవతలైన పోతురాజు, కన్నమరాజు, బాలరాజు, ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తులను మల్కనగిరి ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఆలయ పూజారులు నేతృత్వంలో భక్తుల జయ జయ ద్వానాల మధ్య వనదేవతలను మంగస్థానం,ప్రాణ ప్రతిష్ట, చేయించారు. మహిళా మండలి,అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ,పొల్లూరు మోతుగూడెం ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు త్రాగునీరు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మోతుగూడెం ఎస్సై శివ నారాయణ ఆధ్వర్యంలో 300 మంది పోలీసు మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటిడిఏ పిఓ అపూర్వభరత్, ఏ ఎస్ పి అంకస్ కుమార్ మీనా, సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ వాసుదేవరావు, డీఈ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి గుంపునపల్లి మోహన్, సర్పంచ్ అకేటి సీత,ఎంపీటీసీ వేగినాగేశ్వరరావు పాల్గొని పర్యవేక్షించారు. (Story : ఘనంగా బడాయాత్ర )