డబుల్ బెడ్రూం కాలనీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కలెక్టర్, ఎమ్మెల్యేకు కాలనీవాసుల వినతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా కాలనీల ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం కాలనీ నాయకులు మండ్ల రాజు, గోపాలకృష్ణ, సాయిలీల, సుజాత, సింగోటి, వజ్రాల రమేష్, రఘుచారి, బి.రాము, తోట బాలరాజు లు మాట్లాడుతూ అప్పాయిపల్లి, పీర్లగుట్ట, రాజపేట, పెద్దగూడెం, చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో మంచినీటి సమస్య, వీధి దీపాలు, సిసి రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదలకు, రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం బెడ్ ఇండ్లు కేటాయించింది కానీ వాటికి కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఆవస్తులు పడుతున్నారని వివరించారు. పెద్దగూడెం గుట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడం వల్ల వారి ఇండ్లలోకి వన్యప్రాణులు సంచరిస్తున్నాయని, ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. పీర్లగుట్ట, పెద్దగూడెం డబుల్ బెడ్రూం కాలనీల్లో ప్రహరీ గోడ నిర్మించాలని, అప్పాయిపల్లి డబుల్ బెడ్రూం కాలనీ రోడ్డులో వీధిలైట్లు లేక రాత్రి సమయంలో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించిన వినియోగంలోకి తీసుకురావకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. రాజపేట, చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో సెప్టిక్ ట్యాంకులు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, వెంటనే సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో వీధిలైట్లు, సిసి రోడ్లు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కారానికి తక్షణమే నాలుగు బోర్లు వేయాలని వారి కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిని కాలనీవాసులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమీర్, నిరంజన్, సురేంద్రబాబు, గన్నోజు రవి కుమారాచారి, వినోద్, చందు, సిద్దయ్య, నరేందర్, గొర్ల రమేష్, భూదేవి, రాములమ్మ, తిరుపతయ్య, పెద్ద కాజా, మైను, నూర్ సమద్, నంబి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : డబుల్ బెడ్రూం కాలనీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా)