కోహ్లీ సెంచరీ : భారత్ జయభేరి
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం
రాణించిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా
పాక్ చిత్తుచిత్తు: దుమ్మురేపిన భారత్
దుబాయ్: పాక్‌పై విజయమంటే భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులండవు. తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విజయదుందుభి మోగించింది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంటులో భాగంగా దుబాయ్‌లో ఆదివారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆరంభం నుంచీ ఆధిపత్యం కనబరుస్తూనే ఉంది. పాకిస్తాన్ జట్టు ఇటీవల కాలంలో ఫామ్‌లో లేకపోవడం, భారత బౌలర్ల ప్రతిభ, విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీ, అభిమానుల ఉత్సాహం వెరసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.2 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలిపోగా, భారత్ ఇంకా 7.3 ఓవర్లు మిగిలిఉండగానే 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయి దాటిన మూడవ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.298 వన్డేలు ఆడిన కోహ్లీ 51 సెంచరీలు, 73 అర్థసెంచరీలతో ఈ పరుగుల మైలురాయికి చేరాడు. కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేలోకి అరంగేట్రం చేశాడు.
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొడుతున్న భారీ షాట్లను నియంత్రించే పనిలో పాక్ ఫీల్డర్లు పడ్డారు. ముఖ్యంగా రోహిత్ కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. తొలి ఐదు ఓవర్లలోనే అతను ఈ స్కోరు చేశాడు. కాకపోతే అతని వికెట్టును లాగేసుకోవడంలో షహీన్ అఫ్రీది సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత గిల్‌కు విరాట్ కోహ్లీ తోడయ్యాడు. ఇరువురూ మంచి సమన్వయంతో ఆడుతూ స్కోరును 100 దాటించారు. కాకపోతే గిల్ అనూహ్యంగా అబ్రార్ అహ్మద్ సంధించిన మ్యాజిక్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ 52 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. కోహ్లీకి శ్రేయాస్ అయ్యర్ తోడయ్యాడు. ఇక ఇరువురూ ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. పెద్ద పెద్ద షాట్లు పడకపోయినప్పటికీ, కోహ్లీ పాక్ ఫీల్డర్లను చెమటలు పట్టించాడు. ఇరువురూ 38 ఓవర్లు పూర్తి కాకముందే తమ తమ అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. శ్రేయాస్ ఒక సిక్స్ కొట్టిన తీరు ఆకట్టుకుంది. కాకపోతే అర్థసెంచరీ పూర్తయ్యాక శ్రేయాస్ అయ్యర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఊహించని విధంగా కుష్‌దిల్ షా బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ, శ్రేయాస్‌లు మూడో వికెట్టుకు 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా ఒక ఫోర్ కొట్టి మురిపించినప్పటికీ, వెంటనే అఫ్రీదీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చుకున్నాడు. చివర్లో అక్షర్ పటేల్ సహకారంతో కోహ్లీ భారత విజయాన్ని పరిపూర్తి చేశాడు. ఆ క్రమంలో కోహ్లీ తన అద్భుతమైన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సిక్సర్లు కొట్టకపోయినప్పటికీ, బౌండరీలు భారీగా దంచకపోయినప్పటికీ, మంచి షాట్లతో పాక్ ఫీల్డర్లను ముప్పతిప్పలు పెట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. భారత్‌కు ఇది రెండో విజయం. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై గెలిచింది.
అంతకుముందు, పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్‌లు సమన్వయంతో ఆడుతున్నట్లు కన్పించింది. 8వ ఓవర్ వరకూ భారత బౌలర్లకు ఒక్క వికెట్టూ చిక్కలేదు. 9వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా సంధించిన ఓ బంతిని బాబర్ ఆజమ్ (23) టిప్ చేయబోయి కీపర్ కే ఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తదుపరి ఓవర్‌లో మరో ఓపెనర్ హక్ (10) పరుగు తీసే ప్రయత్నంలో అక్షర్ పటేల్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్‌లు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా స్కోరుబోర్డును గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్టుకు 104 పరుగుల భాగస్వామ్యం సాధించారంటే భారత బౌలర్లు, ఫీల్డర్లు ఎంత నీరసించి పోయారో అర్థమవుతుంది. 34వ ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో పొరబడిన రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను అర్థసెంచరీ పూర్తి చేయకుండానే 46 పరుగుల వద్ద అవుటయ్యాడు. షకీల్ (62, 5 ఫోర్లు) కూడా ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. అతను పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బౌండరీలైన్‌లో పట్టిన క్యాచ్‌తో నిష్క్రమించాడు. అప్పటికే రెండు మూడు క్యాచ్‌లు మిస్సయి, సేవ్ అయిన షకీల్, రిజ్వాన్‌లు పెవిలియన్‌దారి పట్టిన తర్వాత టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. మిగిలిన పాక్ బ్యాట్స్‌మన్లు క్రమం తప్పకుండా వికెట్లను పోగొట్టుకున్నారు. కుష్‌దిల్ షా (38) ఒక్కడే నిలబడటానికి ప్రయత్నించినప్పటికీ, మిగతా వికెట్లు రాలిపోతూ ఉండటంతో పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలక తప్పలేదు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా కీలకమైన 2 వికెట్లు తీసుకోగా, కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లు సాధించి తన గ్రూప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. కివీస్‌తో తన ఆఖరి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. (Story: పాక్ చిత్తుచిత్తు: దుమ్మురేపిన భారత్)
Follow the Stories:
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?