ఏది గుండెనొప్పి? ఏది గ్యాస్ నొప్పి? గుర్తించడమెలా?
న్యూస్‌తెలుగు/అమరావతి హెల్త్: హఠాత్తుగా గుండెనొప్పి వస్తే మరణమే శరణ్యమవుతుంది. అయితే చనిపోవడమనేది 50 శాతం మాత్రమే. మరో 50 శాతం ముందుగా గుర్తించగలిగితే, గుండెనొప్పి వచ్చినా చావు నుంచి తప్పించుకోవచ్చు. కాకపోతే, గుండెనొప్పి ఎలా వస్తుంది? దాని లక్షణాలేమిటి?, గుండెనొప్పి వస్తున్నట్లు గుర్తించడం ఎలా? అనే సమస్యలపై ఎల్లప్పుడూ గందరగోళపడుతూ ఉంటారు. దానికి ఒక కారణం లేకపోలేదు. గుండెనొప్పి కన్నా ఎక్కువ సందర్భాల్లో ఎడమ ఛాతిలో గ్యాస్ నొప్పి వస్తుంది. గుండెనొప్పి వస్తుందన్న భయంతో డాక్టర్ దగ్గరకు వెళ్తారు. 50 వేల రూపాయల మేరకు టెస్టులు చేసిన తర్వాత గుండెనొప్పి లేదని, అది గ్యాస్ నొప్పి అని వైద్యులు తేలుస్తారు. అది గుండెనొప్పి కాకపోతే మంచిదే. అయితే నిజంగానే గుండెనొప్పి వచ్చిన సందర్భంలో అది గ్యాస్ నొప్పి అనే భ్రమలో డాక్టర్లను సంప్రదించకపోతే, నిజంగానే హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం జరుగుతుంది. మరణం ఒక్కసారే వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఏది గుండెనొప్పో, ఏది గ్యాస్ నొప్పో ప్రాథమికంగా తేల్చుకోవడానికి కొన్ని లక్షణాలను కనిపెట్టగలగాలి.
గుండెనొప్పి వస్తే…
ముందుగా గుండెనొప్పి వస్తే సహజంగా కన్పించే లక్షణాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. 99 శాతం మంది వైద్యులు చెపుతున్నట్లుగా ఈ కింది లక్షణాలు ఉంటే గుండె నొప్పిగా పరిగణించవచ్చు.
1. గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది
మనసు చాలా బాధగా ఉందని అప్పుడప్పుడూ అంటూ ఉంటాం. నిజంగానే గుండె మధ్యన భారంగా, బరువుగా ఉన్నప్పుడు కూడా అలానే అన్పిస్తుంది. గుండె చాలా బరువెక్కినప్పుడు చాలామందికి ఎంతో అసౌకర్యవంతంగా ఉంటుంది. ఊపిరి సరిగా ఆడనంతగా ఉంటుంది. ఏదో తేడాగా ఉందన్నట్లుగా మనకే అన్పిస్తుంది. అలా ఉంటే అది కచ్చితంగా గుండెపోటు లక్షణం కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో రోగులను ఎలాగైనా, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి.
2. విపరీతమైన చెమట పడుతుంది
గుండెనొప్పి వస్తుందనడానికి ప్రధాన లక్షణం ఒంట్లో చెమటలు పట్టడం. అకస్మాత్తుగా విపరీతంగా శరీరానికి చెమటలు పోస్తాయి. ఓవైపు చలి వేస్తుంది. మరోవైపు చెమటలు పడతాయి. ఈ విచిత్రమైన, విపరీతమైన లక్షణం కచ్చితంగా గుండెపోటుకు ఒక ప్రధానమైన సంకేతం కావచ్చు. బీపీ తగ్గడం లేదా పెరగడం, ఒంట్లో షుగర్ శాతం తగ్గడం లేదా పెరగడం వంటి లక్షణాలతో ఇలాంటి ప్రభావం కన్పించవచ్చు. కారణం ఏదైనా, ఈ తరహా లక్షణం కన్పించినప్పుడు కచ్చితంగా ఆసుపత్రికి తరలించాల్సిందే. సమయం వృథా చేస్తే ప్రాణాలు మిగిలే పరిస్థితి లేకపోవచ్చు.
3. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది
ఇక మూడవది, మన ఎడమ చెయ్యి, ఎడమ భుజం, ఎడమ వైపున మెడ లాగుతూ ఉంటుంది. రాత్రి పూట అడ్డదిడ్డంగా పడుకునేటప్పుడు కూడా తెల్లవారగానే అటుఇటుగా ఇలాంటి లక్షణమే కన్పిస్తుంది. కానీ లోలోపల ఏదో తేడా ఉన్నట్లు మనకే అన్పిస్తుంది. గుండె మనిషి శరీరానికి ఎడమ వైపున ఉంటుంది కాబట్టి గుండె సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుందని గుర్తించాలి. అదే జరిగితే అదొక గుండెపోటు లక్షణం కావచ్చు. దీన్ని ప్రధాన సంకేతంగా పరిగణించి, ఆసుపత్రికి పరుగుతీయాలి.
4. కొంతమందిలో లో-మోషన్ కూడా అవుతుంది(అంటే విరేచనాలన్నమాట)
గుండెపోటు వచ్చే ముందు అకస్మాత్తుగా విరేచనాలు అవుతాయి. ముందురోజు మనం తిన్న తిండిలో పెద్దగా తేడా అంటూ ఏమీ లేకపోయినప్పటికీ, లోమోషన్ అయిందంటే ఏదో తేడా ఉందన్న విషయాన్ని పసిగట్టాలి. కాకపోతే, ఈ తరహా లోమోషన్ అందరిలో ఉండదు. ఇది కొందరిలో మాత్రమే కన్పించే లక్షణం. అందుకే ఎక్కువమంది బాత్‌రూమ్‌లో గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ, అసహజ విరేచనాలు వచ్చినప్పుడు గుండెపోటుకు ఒక ముందస్తు సంకేతంగా భావించాలని వైద్యులు చెపుతున్నారు.
5. కొందరికి వాంతులు కూడా అవుతాయి
గుండెపోటు వచ్చే ముందు అకస్మాత్తుగా వాంతులు అవుతాయి. విరేచనాలు తరహాలోనే ముందురోజు మనం తిన్న తిండిలో పెద్దగా తేడా అంటూ ఏమీ లేకపోయినప్పటికీ, వాంతులు అయ్యాయంటే ఏదో తేడా ఉందన్న భావించాలి. కాకపోతే, ఈ తరహా వాంతులు కూడా అందరిలో సంభవించవు. ఇది కొందరిలో మాత్రమే కన్పించే లక్షణం. వాంతులు ఆగకుండా రావచ్చు. కడుపులో ఉన్నట్టుండి తిప్పుతుంది. వాంతులు అవుతాయి. ఏదేమైనప్పటికీ, అసహజ వాంతులు వచ్చినప్పుడు గుండెపోటుకు ఒక ముందస్తు సంకేతంగా భావించి, తక్షణమే ఆసుపత్రికి తరలించి, తగిన వైద్యం ఇప్పించాలి.
పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెళితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగించాలి. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది.
గ్యాస్ నొప్పి వస్తే..!
గ్యాస్ నొప్పి అయినా గుండెనొప్పి తరహాలోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కాకపోతే దీన్ని కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు. గ్యాస్ నొప్పికి గుండెలో మంట, తేనుపులు, కడుపు ఉబ్బరం, సహజంగా తేనుపు వచ్చినప్పుడు గొంతులో మంట వంటి లక్షణాలు కన్పిస్తాయి. అది కచ్చితంగా గ్యాస్ ప్రాబ్లమే.
చివరగా ఇచ్చే సూచన ఏమిటంటే, గుండె నొప్పికీ, గ్యాస్ నొప్పికీ తేడా కనుక్కోలేక తికమక పడినట్లయితే, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా మంచిది. అదే ఉత్తమం.
గమనిక: ఈ ఆర్టికల్ వైద్య సమస్యకు అంతిమ పరిష్కారం కాదు. డాక్టర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు, అంతర్జాలంలో లభ్యమైన సమాచారం ఆధారంగా రాసిన ఆర్టికల్ యిది. ఛాతిలో నొప్పి అన్పిస్తే వైద్యులను సంప్రదించడం అనివార్యం. అదొక్కటే మార్గం. (Story: ఏది గుండెనొప్పి? ఏది గ్యాస్ నొప్పి? గుర్తించడమెలా?)
Follow the Stories:
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?