గిరిజనులతో ఒక రోజు
న్యూస్ తెలుగు /సాలూరు : సంస్కృతి, సాంప్రదాయాలు పట్ల అభివృద్ధి గల జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని , సంస్కృతి , సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా శనివారం సెలవు రోజు కావడంతో సాలూరు మండలంలోని మారుమూల లొద్ద ప్రాంతాన్ని సందర్శించారు. అచ్చట గిరిజనులతో మమేకమై వారి జీవన శైలిని పరిశీలించారు. ముఖాముఖి మాట్లాడారు. వారి సాంప్రదాయక వస్త్రధారణ, వస్తు ధారణ గురించి తెలుసుకున్నారు. తీసుకునే ఆహారం విధానాలను పరిశీలించారు. గిరిజనులు పండించే పంటలు, వాటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సంతల్లో ఎక్కువగా విక్రయించడం, తద్వారా వచ్చే ఆదాయం., కొద్దిపాటి పంట ద్వారా జీవనం గడుస్తుందని వారు వివరించారు. దీనికి మార్కెటింగ్ వంటి సదుపాయాలు కల్పించడం వలన మరింత విలువ ఆధారితతో అధికఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వివరించారు. అందుకు అవసరమగు ఏర్పాట్లకు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. లొద్ద ప్రాంతంలో వాటర్ ఫాల్స్ (జలపాతం) ఎంతో రమణీయంగా ఉందని, ఎక్కువ మంది పర్యాటకులు వచ్చుటక అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపరుచుటకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కొంత దూరం ద్విచక్ర వాహనం పైన, కొంత దూరం ట్రెక్కింగ్, వాకింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ వద్దకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేరుకున్నారు. అచ్చట ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎంతో అనుభూతి పొందారు. గిరిజనులతో మమేకమైన రోజు తీయని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లొద్ద ప్రాంతంలో పర్యాటక సంస్కృతి, సాంప్రదాయక అవకాశాలు పెంపొందించుటకు అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గిరిజనులు ఎంతో అమాయకంగా, వారి జీవన విధానం చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆదాయ మార్గాలు తక్కువగా ఉండటం గ్రహించామని వాటిని పెంపొందించుటకు గల అవకాశాలను వివిధ మార్గాల ద్వారా చేపడుతామని ఆయన అన్నారు. పర్యాటకులు ఎక్కువ మంది లొద్ద జలపాతాన్ని పర్యటించడం ద్వారా చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలు జరిగి ఆదాయ మార్గాలు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రయాణించారు. (Story : గిరిజనులతో ఒక రోజు)