జాతీయ సమైక్యతకు తార్కాణం.. ఖాదర్ బాబా దర్గా క్షేత్రం
ఘనంగా ఖాదర్ షా ఉరుసు మహోత్సవాలు
శతాబ్దాల కాలంగా నిర్వీరామ మహాన్న సమారాధన..
నేటి నుంచి మూడు రోజులపాటు 66 వ ఉరుసు సుగంధ సుమహోత్సవాలు..
వేలాదిగా తరలి రానున్న భక్తజనం
ఏర్పాట్లు పూర్తి : ధర్మకర్త ఎండీ ఖలీలుల్లా షరీఫ్ షా..
న్యూస్‌తెలుగు/విజయనగరం ః సూఫీ సెహన్షా హుజూర్ హజరత్ ఖాదర్ బాబా పవిత్ర దర్గా క్షేత్రం జాతీయ సమైక్యతకు తార్కాణంగా నిలుస్తోంది. కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా ఖాదర్ షా ఉరుసు మహోత్సవాలు ప్రతీ ఏటా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. విశ్వ శాంతి దూతగా సూఫీ పరంపర విశ్వవిఖ్యాత వారసుడుగా హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ అవులియా వారిని భక్తులు కలియుగ దైవంగా విశ్వసిస్తుంటారు. ఆ మహనీయుని 66 వ ఉరుసు సుగంధ సుమహోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి.
ఖాదర్ బాబా జీవిత ప్రాశస్త్యం..
తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లి నవాబ్ ఖాదర్ ఖాన్ కి సర్ధార్ ఖాన్, ముహమ్మద్ ఆలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు. ఖాదర్ ఖాన్ పుట్టుకతోనే నవాబ్ అయినప్పటికీ, దైవోపాసనలో ఆయన ఫకీర్ జీవితం గడిపే వారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య బీఅమ్మ కు పదిహేను మంది కుమారులు, ఆరుగురు కుమార్తెలు. ఇక రెండో భార్య ఒక హిందూ స్త్రీ. ఇక తిరుచునాపల్లి ఖాదర్ ఖాన్ జమీనా ఆమెకే హక్కైంది. బీఅమ్మ కుమారుల్లో సర్ధార్ ఖాన్, అలీఖాన్ లు ప్రత్యేకత కలిగిన వారు. సర్ధార్ ఖాన్ విశాఖపట్నం వచ్చి స్తిరపడగా, ముహమ్మద్ ఆలీఖాన్ బ్రిటిష్ సైన్యంలో పనిచేసి రిటైర్మెంట్ అనంతరం విజయనగరం వచ్చి ఇక్కడ ఒక మసీదులో దైవ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన భార్య బీమాబీబీ అప్పటికే గర్భం ధరించి ఉన్నారు. ఆమెకు నెలలు నిండిన తర్వాత కంటోన్మెంట్ లోని గోశాల వద్ద గల తాత గారి ఇంట హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా వారు 1900 సంవత్సరం, నవంబర్ 23 న జన్మించారు. భగవంతుడు లోక కళ్యాణం కోసం ఒక సర్వోత్తమునిని మానవ రూపంలో అవతరింప చేయడం కోసం ఒక ఉత్తమమైన మానవ వంశాన్ని ఎంచుకుంటాడు. ఇది అక్షర సత్యం. ఖాదర్ వలీ బాబా వారి తండ్రి ముహమ్మద్ ఆలీఖాన్ వారి వంశం, జీవితం ఒక మహా యజ్ఞ వేధిక వంటిది. అందుకే తాను చేసిన ఆధ్యాత్మిక యాగంలో యజ్ఞఫలంగా ముహమ్మద్ ఆలీఖాన్ వారికి బాబా ఖాదర్ వలీ జన్మించారు. ఖాదర్ బాబా బాల్యంలోనే ఆయనొక దైవిక అంశలో పుట్టారనడానికి అనేక మహిమలు గోచరమయ్యాయి. యుక్త వయసులోకి వచ్చిన ఖాదర్ వలీ తన తండ్రి అంపశయ్య పై ఉండగా కోరిన కోర్కె మేరకు నాగపూర్ లోని హజరత్ తాజ్ బాబా వారి దర్శనార్థం వెళ్ళారు. వెళ్లిన మూడు రోజుల్లోనే తాజ్ బాబా వారి ప్రియ శిష్యునిగా ఖాదర్ షా ఆయన ఆశీస్సులు పొందుకుని గురోపదేశం మేరకు బాబామెట్ట అటవీ ప్రాంతంలో ఏళ్ళ పాటు కఠోరమైన తపస్సును ఒనర్చారు. ఆయన మహిమలు తెలిసిన పేదవారు, దీనులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు బాబా దర్శనార్థం వచ్చి ఆయనచే మేలులు పొందేవారు. అలా ఖాదర్ బాబా మహిమా ప్రాశస్త్యం నలుదిశలా వ్యాపించి నేడు విశ్వ వ్యాప్తితమైంది. 1961 లో ఖాదర్ బాబా తనకు తానుగా భగవంతుడిని కోరుకుని దైవక్యం చెంది దివ్య సమాధిలోకి వెళ్ళారు.
దర్గా దర్బార్ ను అభివృద్ధి చేసిన అతావుల్లా బాబా..
నాటి నుంచి ప్రతీ ఏటా బాబా వారికి సుగంధ మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఖాదర్ బాబా వారి ప్రియశిష్యులైన హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా (చీమలపాడు బాబా) వారు ఖాదర్ బాబా దర్గాను, దర్బార్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఆరున్నర దశాబ్దాలుగా ఖాదర్ షా వారు ప్రారంభించిన దివ్యన్న సమారాధన ను నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఉరుసు మహోత్సవాల సమయంలో లక్షలాది మందికి అన్న సమారాధన ద్వారా బాబా ప్రసాదాన్ని అందిస్తూ వచ్చారు. అతావుల్లా బాబా సూఫీ పరంపరలో ఆయన పెద్ద కుమారుడు మొహమ్మద్ ఖాజా మొహియునుద్దీన్ చేమలపాడు పీఠాదిపతిగా, ఆయన మూడో కుమారుడు, సామాజిక సేవకుడైనటువంటి డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు విజయనగరం ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ నకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఖలీల్ బాబు నేతృత్వంలో హుజూర్ హజరత్ ఖాదర్ బాబా వారి 66 వ ఉరుసు మహోత్సవాలు శనివారం ప్రారంభమై మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరగనున్నాయి. దేశ విదేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కుల, మత, పేద, ధనిక వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా తరలి రావడంతో ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలు జాతీయ సమైక్యతకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం వసతి, భోజన, తాగునీరు, శానిటేషన్ వంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఖలీల్ బాబు తెలిపారు.
ఉరుసు కార్యక్రమాల వివరాలు:
శనివారం ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పఠనంతో ఉరుస్ మహోత్సవం ప్రారంభమౌతుందని చెప్పారు. అనంతరం జెండా మహోత్సవం, చాదర్ సమర్పణ నిర్వహిస్తామన్నారు. అదేవిదంగా రెండో రోజు ఆదివారం ఉదయం పవిత్ర ఖురాన్ షరీఫ్ పఠనంతో పాటు ఉదయం పది గంటలకు నషాన్, చాదర్, సందల్ షరీఫ్ లతో, ఫకీర్ మేళా ఖవ్వాలీలతో దర్బార్ షరీఫ్ నుంచి ఖాదర్ బాబా వారి భారీ ఊరేగింపు జరుగుతుందని ఖలీల్ బాబు తెలిపారు. మూడో రోజు సోమవారం ఖురాన్ షరీఫ్ పఠనం, చాదర్ సమర్పణ, దస్తార్ బందీ, భక్తులకు తబరుక్ ప్రసాదాల పంపిణీ, సలామ్ ఖుల్ షరీఫ్ తో ఉరుస్ సమాప్తం అవుతుందన్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులు పాటు సూఫీ పీఠాధిపతి హజరత్ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి అధ్యాత్మిక వారసుడు, సజ్జాద నషీన్ ముహమ్మద్ ఖాజా మోహియుద్దీన్ షా ఖాదరి వారి అనుదిన దివ్య సందేశం ఉంటుందని తెలిపారు. ఈ ఉరుస్ మహోత్సవంకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నలుమూలలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఖాదర్ బాబా వారి ప్రేమికులు, అశేష భక్తులు తరలి వస్తారని అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వసతి ఏర్పాట్లు చేశామని, ఈ సందర్బంగా మూడు రోజుల పాటు మహా దివ్య అన్న సమారాధన ఘనంగా, నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. (Story: ఘనంగా ఖాదర్ షా ఉరుసు మహోత్సవాలు)