ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆస్పత్రిలోని అసంక్రమిత వ్యాధుల నివారణ (ఎన్ సి డి) విభాగాన్ని సందర్శించి పరిశీలించారు. అసంక్రమిత వ్యాధులపై రోగులకు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. క్యాన్సర్, బిపి, షుగర్ రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న మహిళ సైదమ్మను కలెక్టర్ సన్మానించి, అభినందించారు. అదేవిధంగా, క్యాన్సర్ నివారణ కోసం కృషి చేస్తున్న సిబ్బంది, నర్సులను, వైద్యాధికారులను ప్రశంసా పత్రాలతో అభినందించారు. కలెక్టర్ ఆస్పత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో స్వయంగా మాట్లాడుతూ వైద్యులు సమయానికి అందుబాటులో ఉంటున్నారా లేదా, సక్రమంగా చికిత్స అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఆస్పత్రిలో ఉన్న ఫార్మసీ స్టోరును సందర్శించిన కలెక్టర్ వైద్యులు రాసి ఇచ్చిన చీటీలను తీసుకుని ఫార్మసీ స్టోర్ సిబ్బంది మందులు ఈ సరిగ్గా ఇస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు అన్ని మందులు ఇక్కడే ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అనంతరం, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల వార్డులోకి వెళ్లి వారికి మెరుగైన సేవలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడుతూ ఏ సమయానికి వస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత డ్యూటీ డాక్టర్స్ రూమ్ ని సందర్శించి, బయోమెట్రిక్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, సూపరిండెంట్ రంగారావు, ఎన్ సి డి వైద్యులు రామచంద్ర, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి)