మరుగున పడిన విద్యారంగ సమస్యలకు లోకేష్ పరిష్కారాలు
వినుకొండ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన విద్యారంగం సమస్యలకు మంత్రి లోకేష్ స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఒక్క వాట్సాప్ మెస్సేజ్ చేస్తే రాష్ట్రం మొత్తం మధ్యాహ్న భోజనం పథకం పునఃప్రారంభించడం, ఫీజు బకాయిల చెల్లింపు, మౌలిక వసతుల కల్పన, బోధనా సిబ్బంది నియామకాలే అందుకు నిదర్శనం అన్నారు. మంగళవారం వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల 56వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డిగ్రీలు, పీజీలు చేసిన వారికి ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టిస్తున్న మంత్రి లోకేష్‌కి అభినందనలు తెలిపారు. 7 నెలల్లోనే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని, వీటి ద్వారా యువతకు 4 లక్షలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో లక్షల కోట్లు దోచుకున్నారని, పేద విద్యార్థుల ఫీజులు పెండింగ్ పెట్టి పోయారని కూటమి వచ్చాక ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు తొలి విడత మొత్తాన్ని విడుదల చేశారన్నారు. మొదట 571.96కోట్లు ఇచ్చారని, ఈవారంలో మరో 216కోట్లు ఇస్తున్నారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద ఈ ఏడాది 2 లక్షల మందికి పైగా ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను ఉచితంగా అందించారని గుర్తు చేశారు. జూన్‌లోనే తల్లికి వందనం పథకం అమలు కాబోతోందని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులను పరీక్షలు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధం చేసేందుకు మంత్రి లోకేష్ చెన్నై ఐఐటి ప్రొఫెసర్లతో “విద్యాశక్తి” కోచింగ్ ఇస్తున్నారని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద అనంతపురం, గుంటూరులో విద్యా శక్తి మొదలుపెట్టి జేఈఈ బోధన చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో అన్ని కాలేజీల్లో పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. జూనియర్ కళాశాల అంటే జీవీ ఆంజనేయులు కళాశాలగా అంతా భావిస్తారని, పేద విద్యార్థులు ఎక్కడ చదివితే అక్కడ తన మనసు, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయన్నారు. ప్రస్తుతం కళాశాలలో సరిపడా సిబ్బంది లేరని, త్వరగా వారిని భర్తీ చేసేలా ప్రభుత్వానికి లేఖ పంపుతానని చెప్పారు. ఈ సంవత్సరం ఎవరైతే బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారో వారికి ప్రతిభ ఉపకార వేతనాలు అందిస్తామని, గోనుగుంట్ల సత్యనారాయణ మెమోరియల్ స్కాలర్‌షిప్‌ల కింద మొదటి మూడు బహుమతులు అందిస్తామన్నారు. (Story : మరుగున పడిన విద్యారంగ సమస్యలకు లోకేష్ పరిష్కారాలు)