ఎట్టకేలకు భరోసా నిధులు విడుదల..
– హర్షం వ్యక్తం చేసిన కుందనవానిపల్లి రైతాంగం..
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు భరోసా నిధులు ఎట్టకేలకు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసిన కుందనవానిపల్లి గ్రామంతో పాటుగా గండిపల్లి రెవెన్యూ పరిధిలోని రైతుల అకౌంట్లో సైతం డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన విషయం పాఠకులకు విధితమే.రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి 26న ఆదివారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా, గండిపల్లి రెవెన్యూ పరిధిలోని గండిపల్లి, చౌటకుంట, మైసమ్మవాగు తండా, కుందనవానిపల్లి గ్రామాల్లోని 1348 మంది రైతులకు గాను 1710 ఎకరాలకు 16,166798/- లక్షల రూపాయలు నిధులు విడుదలైనట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఒక గుంట పొలానికి 150 రూపాయల చొప్పున ఎకరానికి 6000 ల రూపాయలను మొదటి విడతగా రైతుల అకౌంట్లో డబ్బులు జమైనట్లు సూచించారు.
గండిపల్లి రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులకు హుస్నాబాద్,అక్కన్నపేట, మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్, ఎస్బిఐ, డీసీసీబీ బ్యాంకులలో ఉన్న ఖాతాదారులకు డబ్బులు విడుదలకాగా, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉన్న రైతులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో డబ్బులు విడుదల కాలేదని, కొద్దిమందికి మాత్రమే డబ్బులు అకౌంట్లో జమైనట్లు పేర్కొంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా పేరు మార్చడంతో డబ్బులు విడుదల కావడం కొద్దిగా ఆలస్యం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎన్ని ఎకరాల పొలం ఉన్న కూడా అందరికీ రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి.
ఏది ఏమైనా రైతు భరోసా నిధులు విడుదల కావడంతో గండిపల్లి రెవెన్యూ పరిధిలోని రైతాంగంతో పాటు పైలెట్ గ్రామంగా ఎంపికైన కుందనవానిపల్లి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద కుందనవానిపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి,హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు , పార్టీ కార్యకర్తలు నాయకులు, రైతులు , గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అర్హులకు పక్కాగా సంక్షేమం ..
లింగంపల్లి సారయ్య, (కుందనవానిపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు)
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిందని రైతుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నది.కష్ట కాలంలో కూడా రైతుల బాధలు అర్థం చేసుకొని పెట్టుబడి సాయం అందించారని చెబుతూ.. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.అలాగే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, వారి మాటలను ప్రజలు పట్టించుకోవద్దు.
(ప్రత్యేక కథనం: న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి- నారదాసు ఈశ్వర్)