క్రీడలు మానవ జీవితానికి విజయ రహస్యాలు
-విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
-విద్యార్థులకు ఆర్టీవో మానస విజ్ఞప్తి
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా మానవ జీవితానికి విజయ రహస్యాలు అని వనపర్తి ఆర్టీవో మానస అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ హైస్కూల్ లో రిపబ్లిక్ డే పురస్కరించుకుని గురువారం విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్టీవో మానస హాజరయ్యారు. కబడి, కోకో క్రీడలను ఆమె ప్రారంభించి ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి టాస్ వేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు రాణించాలని, చదువుతోపాటు క్రీడల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల గొప్పతనం గురించి క్రీడాకారులు తమ జీవితంలో సాధించిన విజయాలపై విద్యార్థులకు వివరించారు. మదర్స్ ల్యాప్ హైస్కూల్ ప్రిన్సిపల్ అబ్దుల్ ముబిన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దే వికాస కేంద్రాలని అన్నారు. ప్రతిరోజు ప్రతి విద్యార్థి కొంత సమయం క్రీడల కోసం కేటాయించాలని సూచించారు. ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా ఉండడంతో పాటు రక్తప్రసరణ బాగా జరుగుతుందని, దీంతో చురుకుగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాగా గొప్ప క్రీడాకారులు కావాలని కలలు కంటారు కానీ అలా గొప్ప ఆటగాళ్లు కావాలంటే నిరంతర సాధన చేయాలని విజ్ఞప్తి చేశారు. గొప్ప ప్రయత్నాలు చేస్తేనే ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో మీరు ఒకరు కావచ్చని, చరిత్రలు అందరూ చదువుతారు కానీ కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారని గుర్తు చేశారు. ఇవన్నీ గొప్ప ప్రయత్నాల ద్వారానే సాధ్యమవుతుందని విద్యార్థులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. (Story :క్రీడలు మానవ జీవితానికి విజయ రహస్యాలు)