అది ట్రంప్‌కు సాధ్యమేనా?
పాలస్తీనా సమస్య, అదానీ కేసుపై కె.నారాయణ
అమరావతి: పూర్తిగా దెబ్బతిన్న పాలస్తీనాకు సాయం చేయడం అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందున్న పెద్ద కర్తవ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. అలాగే అమెరికా కోర్టులో నడుస్తున్న అదానీ కేసు విషయంలో కుమ్మక్కు అవుతారా? లేక అదానీకి శిక్షపడేలా చూస్తారా అన్నది అనుమానమేనని ఆయనన్నారు. అమెరికా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్ కు నారాయణ అభినందనలు తెలిపారు. సహజంగా ప్రజలచేత ఎన్నికయిన వారినెవరినైనా అభినందించాల్సిందేనని అన్నారు. కాకపోతే, ట్రంప్‌పై ఇప్పటికే అవినీతిపై అమెరికా సుప్రీం కోర్టులో తీర్పు విడుదలై ఉందని, అయినా ఆయన ఎన్నికకు అమెరికాలో అభ్యంతరం లేకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన నేపథ్యంలో పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ప్రశాంతతకు నెలకొన్నందుకు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పాలస్తీనా పూర్తిగా విధ్వంసానికి గురైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఆ దేశంలో యథాతథ పూర్వస్థితికి ట్రంప్ సాయం చేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉందన్నారు. న్యూయార్క్ కోర్టు లో భారతదేశానికి చెందిన కార్పొరేట్ అధిపతి అదానీపై లంచం కేసు నమోదయిందని గుర్తుచేస్తూ, అమెరికా గడ్డపై ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లంచం ఇచ్చినట్లుగా వచ్చిన ఆరోపణల ఫలితంగా తెలుగు ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థికభారం పడడం తీవ్రంగా ఖండించ తగ్గదన్నారు. ఈ వ్యవహారంలో న్యూయార్క్ న్యాయవ్యవస్థ తగుచర్యలు తీసుకునేలా ట్రంప్ వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. (Story: అది ట్రంప్‌కు సాధ్యమేనా?)