బిగ్‌బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్-20 మంది మావోయిస్టులు మృతి
చంద్రబాబుపై దాడికేసులో సూత్రధారి చలపతి హతం
ఒడిశా- చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మూడు రోజులపాటు ఎదురుకాల్పులు
మృతుల్లో ఇద్దరు మహిళలు
ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు హతం
చింతూరు (న్యూస్ తెలుగు): మూడు రోజులుగా జరుగుతున్న సుదీర్ఘ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు మంగళవారం మధ్యాహ్నం వెల్లడయ్యాయి. దీని ఫోటోలను కూడా పోలీసులు బయటపెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే కోటి రూపాయలు రివార్డు కలిగిఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి కూడా ఈ మృతుల్లో ఉండటం గమనార్హం. అతను చిత్తూరుకు చెందిన వ్యక్తి. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై జరిగిన దాడిలో అతను కీలక నిందితుడుగా భావిస్తున్నారు. చలపతితోపాటు మరో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా హతమయ్యారు. ఇటీవల కాలంలో ఇంత భారీ ఎన్‌కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి. దీన్ని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. ఒడిశా- చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని నౌపాడ, గరియా బంద్ జిల్లా మొయిన్ పూర్ పోలీస్‌స్టేషన్ సరిహద్దుల్లోని కులరిఘాట్ అటవీ ప్రాంతంలో60 మంది మావోయిస్టులు భారీ ఎత్తున సమావేశమయ్యారని నిఘా విభాగం అందించిన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. చత్తీస్‌గఢ్-ఒడిశాకు చెందిన 65, 211 సిఆర్‌పీఎఫ్ బెటాలియన్, 207 కోబ్రా, డి ఆర్ జి జవాన్లు, యస్ ఓ జి, ఈ-30 బలగాలు సుమారు వెయ్యి మంది పోలీస్ బలగాలు ఈ యాక్షన్‌లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బలగాలు గత 24 గంటలు గా అడవి ని జల్లెడ పట్టాయి. కుల రీఘాట్ రిజర్వుడ్ ఫారెస్ట్ లో మావోయిస్టులు ఎదురుపడి జవాన్ లపై రాకెట్ లాంచర్ లాంటి ఆయుధాలు విసిరారు. ఈదశలో జవాన్లు ముందుకు వెళ్లి 20 మంది మావోయిస్టులను మంగళవారం ఉదయం వరకు మట్టుపెట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. పదిమంది పురుషుల్లో కేంద్ర కమిటీసభ్యులు, జోనల్ కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్న ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు జై రామ్ అలియాస్ చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇతనిపై ఒడిశా ప్రభుత్వ కలెక్టర్ వినీలకృష్ణ రూ.కోటి రివార్డ్ ను 2011లో ప్రకటించారు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా. తవళం పల్లి మండలం మత్యం గ్రామానికి చెందిన వాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి బాంబు సంఘటనలో కీలక సూత్రధారి ఇతనేనని గరియాబంద్ పోలీసులు ధ్రువీకరించారు. వరంగల్ జిల్లా దామోదర్ ఏలియాస్ చొక్కా రావు కోసం విస్తృత గాలింపు జరుగుతుంది. ఎన్‌కౌంటర్లో అధిక సంఖ్య లో మావోయిస్టులు గాయాలపాలైనట్లు తెలిసింది. సంఘటన స్థలం నుండి ఎస్ ఎల్ ఆర్, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఐడి బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్తృతంగా గాలింపులు కొనసాగుతున్నట్లు తెలిసింది. చత్తీస్‌గఢ్ జవాన్లు, పోలీసులు చేసిన ఈ ఎన్‌కౌంటర్‌ను అతి పెద్ద విజయంగా పేర్కొంటూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ అభినందనలు తెలిపారు. కేంద్రహోమ్శాఖ మంత్రి అమిత్ షా సంకల్పాన్ని బలపరుస్తూ భద్రతా దళాలు నిరంతరం విజయం సాధిస్తున్నాయని, 2026 నాటికి చత్తీస్‌గఢ్ రాష్ట్రం కచ్చితంగా నక్సలి జం నుండి విముక్తి పొందుతుందన్నారు.
మావోయిస్టులకు ఎదురు దెబ్బః అమిత్‌షా
తాజా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మావోయిజం కొనఊపిరితో ఉందని, 2026 కి మావోయిస్టు రహిత భారత దేశంగా కొనసాగడానికి ఈ సంఘటన మలుపు అని పేర్కొన్నారు. (Story: బిగ్‌బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్-20 మంది మావోయిస్టులు మృతి)