సంక్షేమ పథకాల సర్వే త్వరగా పూర్తి చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : సంక్షేమ పథకాల సర్వే త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించే సర్వేను ఆదివారం అదనపు కలక్టర్ పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో పర్యటించి తనిఖీ చేశారు. అర్హులైన రైతు కుటుంబాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు జి.పి.ఎస్, జియో ట్యగింగ్ యాప్ ల ద్వారా వ్యవసాయ యోగ్యం లేని భూములు అనగా లే అవుట్ ప్లాట్లు, ఇరిగేషన్, రోడ్డు కొరకు సేకరించిన భూములు, ఇప్పటికే ఇళ్ళు నిర్మించుకున్న స్థలాలు, పారిశ్రామిక స్థలాలను గుర్తించి రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఏ మాత్రం భూములు లేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం అందించే నిజమైన లబ్ధిదారులను నిబంధనల ప్రకారం ఈ సర్వేలో గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా ఇప్పటికే రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను సుపర్ చెక్ చేసి ఎవరైనా అనర్హులు ఉంటే గుర్తించి జాబితా నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారికై జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. సర్వే మొత్తం జనవరి 20 లోపు పూర్తి చేయాలని, 21 నుండి నిర్వహించనున్న గ్రామ సభల పై గ్రామాల్లో వార్డుల్లో టాం టాం చేయించి ముందస్తు ప్రచారం చేయించాలని సూచించారు. తహసిల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు అదనపు కలెక్టర్ వెంట అన్నారు.(Story : సంక్షేమ పథకాల సర్వే త్వరగా పూర్తి చేయాలి )