వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతులకు రైతు భరోసా లబ్ధి
న్యూస్ తెలుగు/వనపర్తి : వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతులకు రైతు భరోసా లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హుల ఎంపిక కోసం జరుగుతున్న సర్వే విషయమై ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కార్యాలయంలో కలెక్టర్ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యం కానీ భూములను, ఇప్పటికే లే అవుట్లుగా మారిన భూములను తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన, నిజమైన రైతులకు రైతు భరోసా లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా వ్యవసాయ యోగ్యం కానీ భూములను లే అవుట్లు, ఇళ్ళు నిర్మించుకున్న భూములు, భూసేకరణ చేసిన భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సర్వే నెంబర్ల ఆధారంగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ఇప్పటికే వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలని సూచించారు. తహసిల్దార్, వ్యవసాయాధికారులు, మున్సిపల్ కమిషనర్ సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ యోగ్యం లేని భూములను గుర్తించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తయిన సర్వే ఆధారంగా జాబితా సూపర్ చెక్ చేసి నిజమైన అద్దె దారులు ఎవరు, నిజమైన అర్హులు ఎవరు అనేది పక్కాగా గుర్తించాలన్నారు. ప్రత్యేక అధికారి జడ్పి డిప్యూటీ సిఈఓ రామమహేశ్వర్, తహసిల్దార్ వెంకటేష్, ఎంపీడీవో చెన్నమ్మ, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతులకు రైతు భరోసా లబ్ధి )