బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భౌతికంగా ఉన్నట్టా? లేనట్టా?
మృతి లేఖ పై వ్యక్తం అవుతున్న అనుమానాలు
న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం :
మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భౌతికంగా ఉన్నట్టా? లేనట్టా? తెలంగాణా పోలీసుల్లోనే కాదు, విప్లవోద్యమ అభిమానుల్లోనూ రేకెత్తుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా పూజరి కాంకేర్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య ఈనెల 16న జరిగిన భీకరపోరులో చనిపోయిన 12 మంది నక్సలైట్ల డెడ్ బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో చనిపోయిన మరికొందరు నక్సలైట్ల డెడ్ బాడీలనేగాక, తీవ్రంగా గాయపడినవారిని మావోయిస్టులు తీసుకువెళ్లారనేది పోలీసుల అంచనా.
కాల్వపల్లిలో దామోదర్ ఇల్లు
ఈ పరిణామాల్లోనే మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో శనివారం ఓ ప్రకటన వెలువడింది. కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయింది 12 మంది కాదని, మొత్తం 18 మంది మరణించారనేది ఆ ప్రకటన సారాంశం. ఈ ఎన్కౌంటర్ మృతుల్లో తెలంగాణా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణించినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో విడుదలైన హిందీ ప్రకటన చెబుతోంది. ఘటనా స్థలంలో దామోదర్ ధైర్యసాహసాలతో పోరాడుతూ అమరుడైనట్లు ఆ ప్రకటనలో గంగ పేర్కొన్నారు. దామోదర్ మరణం తమ పార్టీకి తీరని నష్టంగానూ గంగ స్పష్టం చేశారు.
దామోదర్ మరణ వార్తతో కాల్వపల్లిలో విషాద ఛాయలు
తెలంగాణా రాష్ట్రంలో తిరిగి బలోపేతం కావడానికి మావోయిస్టు పార్టీ చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. ఈమేరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని తెలంగాణా జిల్లాలో నక్సల్ కదలికలు తరచుగా కనిపిస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే చెల్పాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ఏడుగురు నక్సలైట్లు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో తెలంగాణా మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణించినట్లు వెలువడిన ప్రకటన పట్ల రాష్ట్ర పోలీసులు ఒకింత ఊపిరి పీల్చుకోవలసిన అంశమే. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ పార్టీని తిరిగి ఇక్కడ నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుండడమే ఇందుకు కారణం. కానీ గంగ పేరుతో విడుదలైన ప్రకటనను తెలంగాణా ఇంటలిజెన్స్ అధికారులు అంగీకరించక పోవడమే అసలు విశేషం. పైగా ఈ లేఖపై అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అటు ఛత్తీస్ గఢ్ పోలీసులు కూడా దామోదర్ మరణించాడనే వార్తలను ధ్రువీకరించడంలేదు.
పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ హిడ్మా
ఈ పరిస్థితుల్లో ఇంతకీ దామోదర్ భౌతికంగా ఉన్నట్టా? లేనట్టా? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దామోదర్ వంటి కీలక నేతపై పోలీసుల దృష్టి మరల్చడానికి మావోయిస్ట్ పార్టీ ఈ తరహా ప్రకటన చేసి ఉంటుందా? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా రేకెత్తుతోంది. కానీ ఛత్తీస్ గఢ్ పోలీసులకు దామోదర్ కన్నా మరో ముఖ్య నేత హిడ్మా మెయిన్ టార్గెట్ గా చెప్పవచ్చు. పూజరి కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా తప్పించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పార్టీ ముఖ్యనేతలపై పోలీసుల దృష్టి మళ్లించేందుకు మావోయిస్టు పార్టీ వేసిన ఎత్తుగడగా దామోదర్ మృతి ప్రకటనను భావించినా, అటువంటి నేతల్లో హిడ్మా ముందు వరుసలో ఉంటారనేది విప్లవోద్యమ పరిశీలకుల భావన.
మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత జంపన్న
ఈ కోణం నుంచి పరిశీలించినపుడు దామోదర్ మరణించాడనే ప్రకటనపై పోలీసులు అనుమానించడం సహజమే కావచ్చు. కానీ దామోదర్ మరణించిన వార్త నిజమే అయి ఉంటుందని ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు పార్టీ మాజీ ముఖ్య నేత జంపన్న అలియాస్ జీనుగు నరసింహారెడ్డి ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. ఎన్కౌంటర్ ఘటనలో దామోదర్ మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించకపోవడానికి అతని డెడ్ బాడీ పోలీసులకు లభించకపోవడం కారణం కావచ్చని కూడా జంపన్న అభిప్రాయపడ్డారు. పోలీసులతో జరిగిన కాల్పుల ఘటనలో దామోదర్ చనిపోయినట్లయితే అతని డెడ్ బాడీని సహచరులే తీసుకువెళ్లి దహనం చేసి ఉంటారని, లేదా తీవ్రంగా గాయపడితే తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచి ఉండవచ్చని జంపన్న విశ్లేషించారు. మొత్తంగా దామోదర్ మరణించినట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనను తాను విశ్వసిస్తున్నట్లు జంపన్న స్పష్టం చేశారు. మొత్తంగా దామోదర్ మరణంపై మావోయిస్టు పార్టీ మరోసారి క్లారిటీ ఇస్తూ ఇంకో ప్రకటన జారీ చేసే అవకాశం లేకపోలేదు. (Story : బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భౌతికంగా ఉన్నట్టా? లేనట్టా?)