సంక్షేమం, సంస్కరణల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర
వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణ అమల్లో దివంగత నందమూరి తారక రామారావుది చెరగని ముద్ర అని, అన్నింటా ఆయనకు ఆయనే పోటీ అంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఘన నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాలను పేద ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆరే అని కొనిడియారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గంగినేని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు కూడా విశేష స్పందన లభించింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సహా 518 మంది రక్తదానం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్, నందమూరి అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎన్నో ఆటుపోట్లుకు ఎదురొడ్డి చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. ప్రపంచంలో కోటి మందికిపైగా సభ్యత్వాలు కలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెదేపా అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల అవుతుందని, తెదేపా సహా పార్టీ నాయకులపై ఏదొక ప్రచారం చేస్తుంటారని, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాగుకు ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు . జగన్ సాక్షిని అడ్డం పెట్టు కుని నాడు స్మార్ట్ మీటర్లపై అబద్ధపు ప్రచారం చేస్తే తిప్పికొట్టామని, ఇప్పుడు ఉచిత విద్యుత్‌ను 9 నుంచి 7 గంటలకు కుదిస్తున్నారని ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకి
ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. అనంతరం చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. పేదల ఇళ్లంటే గుడిసెలు అనుకునే రోజుల్లో శాశ్వత ఇళ్లు కట్టించిన మహానుభావు డు ఎన్టీఆర్ అన్నారు. దేశంలోనే పేదలకు పెన్షన్ ఇచ్చిన మహానాయకుడని అన్నారు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచి పోయాయని, ఏ పాలకులు, ప్రభుత్వాలు వచ్చినా అదే మార్గంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మహిళై ఉండి కూడా మహిళల ఆస్తిహక్కు గురించి ఆలోచించలేక పోయారని, ఎన్టీఆర్ మాత్రం ఆడమగ సమానం అని ఆడపిల్లలకూ ఆస్తి హక్కు కల్పించారన్నారు. సందేశాత్మక, సమాజానికి ఉపయోగపడే జన్మభూమి స్ఫూర్తితో, దేశభక్తి భావాలతోటి గొప్పగొప్ప సినిమాలు తీశారంటూ నివాళులర్పించారు. తెలుగుప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షగా చెప్పారు. అదే ఆశయంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించి పని చేస్తున్నారన్నారు. తొలుతగా శివయ్య స్తూపం సెంటర్, ఆర్టీసీ సెంటర్, ఎన్ఎస్పి కాలువ వద్ద, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున పులిహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మరియు కూటమి నేతలు లగడపాటి వెంకట్రావు, రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య, పెమ్మసాని నాగేశ్వరరావు, ఎన్.శ్రీనివాసరావు, కె.నాగ శీను, యార్లగడ్డ లెనిన్ కుమార్, మేడం రమేష్, పి.అయూబ్ ఖాన్, డాక్టర్ గోగినేని సాంబశివరావు, షమీంఖాన్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : సంక్షేమం, సంస్కరణల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర)