మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాన్ దామోదర్ హతం
– ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మృతి
– నిర్ధారించిన మావోయిస్టు పార్టీ
– ఆయనపై రూ.50 లక్షల రివార్డు
– పార్టీకి భారీ ఎదురుదెబ్బ
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ ఘడ్లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ శనివారం విడుదల చేసిన లేఖలో నిర్ధారించింది. ఆ ఎన్ కౌంటర్ మొత్తం దామోదర్ తో సహా 18 మంది మావోయిస్టులు హతమైనట్లు మావోయిస్టు బస్తర్ ఏరియా కార్యదర్శి గంగ ఆ లేఖలో పేర్కొన్నారు. అగ్రనేత బడే చొక్కారావు అలియాన్ దామోదర్ మృతితో 30 ఏళ్ల అజ్ఞాతానికి తెరపడినట్లు అయ్యింది. మోస్టువాంటెడ్గా ఉన్న ఆయన తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఆరు నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన చొక్కారావు అనేక విధ్వంసకర కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆయనపై పలు పోలీస్టేషన్లలో కేసులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు చిన్నతనంలోనే మావోయిస్టు ఉద్యమానికి ప్రభావితమై అజ్ఞాతంలోనికి వెళ్లాడు. దామోదర్ తోపాటు మరో తెలుగు మావోయిస్టు నేత నర్సింహారావు కూడా మృతుల్లో ఉన్నట్లు విడుదలైన లేఖలో పేర్కొన్నారు. బడే చొక్కారావు మృతితో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగినట్లు అయ్యింది. గత ఏడాది నుండి ఇప్పటి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ వరుసగ నష్టాలను చవిచూస్తుండగా ఇప్పుడు అగ్రనేతను కోల్పోయింది. చొక్కారావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాధఛాయలు ఆలుముకున్నాయి.(Story : మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాన్ దామోదర్ హతం )