వ్యవసాయ రంగాన్ని కాపాడిన ఘనత కేసీఆర్‌దే
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వ్యవసాయ రంగాన్ని కాపాడిన ఘనత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్‌దే అని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ సాగునీళ్లు ఇస్తేనే భూములు సాగవుతాయని.. సాగునీళ్లే ఇవ్వకపోతే పంటలు ఎక్కడ పండుతాయని ప్రశ్నించారు. పంటలు లేకుంటే బోనస్ ఎక్కడిది? మద్దతు ధర ఎక్కడిదని అడిగారు. భూమిని నమ్ముకుని కష్టపడే రైతులకు భరోసా ఇచ్చేందుకు ఇన్ని అవాంతరాలు ఎందుకు పెడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కోటి 57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడిలో ప్రభుత్వం కేవలం 47 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించిందని తెలిపారు. ఆ సేకరణలో సన్న వడ్లు కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని, దానికి కూడా పూర్తి బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పంచ పాండవులే మంచం కోళ్ల వలె ముచ్చటగా ముగ్గురు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు తీరు ఉందని చెప్పారు. వందేళ్ల పార్టీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాకు తెలియదా?’ అని మీరే అన్నారని, ఇప్పుడు పథకాలు అమలు చేయమంటే కేసీఆర్ సర్కార్ మీద నెపం నెడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు ఏమిటి? వనరులను ఎలా వినియోగించాలి అన్న ఆలోచన లేకుండా, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైందని.. అయినా సాగునీళ్లను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీళ్లు, కరెంటు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎవరికీ పట్టింపులేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ సరఫరా సరిగ్గా లేదని, వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. సాగునీళ్లు లేవన్న సాకుతో రైతులకు రైతుభరోసా ఇవ్వకుండా ఎగ్గొడితే ఊరుకోమని హెచ్చరించారు.ఎండాకాలంలో మత్తళ్లు దుంకించిన చరిత్ర కేసీఆర్‌ది, భారీ వర్షాలు కురిసినా సాగునీళ్లు ఇవ్వలేని చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. రైతులకు ఎగ్గొట్టిన రైతుభరోసా రూ. 17,500 చెల్లించాలని.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలసి కోఆపరేటివ్ ఫెడరలిజం కొనసాగిస్తున్నాయని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీద పెట్టిన కేసు విషయంలో ఈడీ కేసు దాఖలు చేయడం దానికి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో 11 విడతల్లో 73 వేల కోట్లు రైతులకు అందించామని తెలిపారు. రైతుబంధు పథకానికి రూ.25 వేల కోట్లు వృథా అని ఆరోపించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. మరి ఏడాదిలో ఆ ఉపసంఘం ఏం తేల్చిందని ప్రశ్నించారు. సీఎం స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా అని నిలదీశారు. అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో ఉండొద్దని దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మొన్నటి దాకా గుట్టలు, రాళ్లు, డిజిటల్ సర్వే, ఐటీ అంటూ చెప్పి ఇప్పుడు అందరికీ ఇస్తామని చెబుతూ కలెక్టర్ల సమావేశం పెట్టి భారం వారి మీద నెట్టారని అన్నారు. పంటలు పండిస్తేనే రైతుభరోసా ఇస్తామని అంటున్నారని తెలిపారు. సీఎం స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా అని నిలదీశారు. (Story : వ్యవసాయ రంగాన్ని కాపాడిన ఘనత కేసీఆర్‌దే)