ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
– మతోన్మాదం తో పాలన సాగిస్తున్న బీజేపీ తో దేశానికి నష్టం
– ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు
న్యూస్‌తెలుగు/ శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 6,7,8,9 తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ 22 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ ఆర్ దాసరి క్రాంతి భవన్ ( సీపీఐ కార్యాలయం) లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని , నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారన్నారు. దేశంలో 4,28,278 మంది మహిళల పైన, 1,49,404 చిన్నపిల్లల పైన దాడులు, హత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాటిని నిలువురించే పరిస్థితి లేదన్నారు. మోడీ హయాం లో 3400 మత ఘర్షణ లు జరిగాయి అన్నారు. మతోన్మాదం తో బీజేపీ పాలన సాగిస్తుందని, కులాలు, మతాలు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి విభజించు పాలించు అనే లా మోడీ పాలన ఉందన్నారు. దేశం లో ఎక్కడ చూసినా అనగారీనా వర్గాల మీద దాడులు అధికం అయ్యాయని, దళితులు, మహిళ ల మీద దాడులు అధికం అవుతున్నాయి అన్నారు. మోడీ పాలన లో దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం అంటున్న బీజేపీ పెద్దలు రోజుకు రూ. 1.26 లక్షల కోట్లు, సెకనకు రూ. 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మి, దానికి ప్రతీ ఫలంగా ఎన్నికల ఫండ్ రూపంలో బీజేపీ కి లాభం చేకూరుస్తూ, ఎన్నికల్లో ఆ దానం తో నే గెలుస్తున్నారు తప్ప , ప్రజా ఆమోదం మాత్రం బీజేపీ కి లేదన్నారు. ఉత్తరాంధ్రకు జీవనాధారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం , కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని కోరారు. దేశ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై మాట్లాడడం లేదని, విభజన హామీల అమలుకు దిక్కే లేదని కనీసం వీటినైనా అమలు చేసి ఉంటే సంతోషించేవారమని అన్నారు. యువతకు ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారని, మరి కొంతమంది నిరాశ,నిస్పృహాలతో డ్రగ్స్, కోకోయిన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని అన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్తులుగా, విచ్చన్నకారులుగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలలో అనేక అంశాలపై చర్చించి భవిష్యత్ పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. నాగభూషణం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీ హెచ్. రవి, ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. (Story : ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి)