బతికుండగానే రికార్డుల్లో చనిపోయనట్లుగా నమోదు పింఛను నిలిపివేత
చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిసి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు
న్యూస్ తెలుగు /వినుకొండ : పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం వెలుగు చూసింది. నిక్షేపంగా బతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా చూపించడం, బీమా డబ్బులు చెల్లించడం, అనంతరం పింఛను నిలిపివేయడం ముక్కున వేలేసుకునేలా చేసింది. తాను జీవించే ఉన్న నెలలుగా పింఛను రాక, అవస్థలు భరించలేక బాధిత మహిళ ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల్ని ఆశ్రయించడంలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే వినుకొండ పట్టణం, సీతయ్య నగర్, వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పింఛను తీసుకుంటు న్నారు. పింఛనుడబ్బే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కానీ 2023 అక్టోబర్ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అదే నెలలో బతికున్న శేషమ్మను చనిపోయినట్లుగా రికార్డుల్లో నమో దు అయింది. ప్రమాద బీమా పేరిట నామినీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. తర్వాతి నెల నుంచి ఆమె పింఛను ఆగిపోయింది. అప్పట్నుంచి బాధిత మహిళ కన్నీటి పర్యంతం అవుతూ ఎంతమందితో కష్టం చెప్పుకున్నా పట్టించుకున్నవారు లేక పోయారు. చివరకు ఇటీవలే బాధిత మహిళ చీఫ్‌విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల్ని ఆశ్రయించడంతో వినుకొండ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆమె చనిపోయినట్లుగా నమోదు కావడం, ప్రమాద బీమా జమ అన్నింటిపై విచారణ జరిపించాలని ఆదేశించారు. శేషమ్మకు న్యాయం చేయాలని, పింఛను పునరుద్ధరించాలని సూచించారు. ఈ మేరకు జీవీ ఆంజనేయుల్ని కలసిన బాధిత మహిళ శేషమ్మ చేసిన సాయానికి కృతజ్ఞ తలు తెలిపారు. తనలా మరెవరీ అన్యాయం జరగకుండా చూడాలని వేడుకున్నారు.(Story : బతికుండగానే రికార్డుల్లో చనిపోయనట్లుగా నమోదు పింఛను నిలిపివేత )