ఒగ్గు కథకు జీవం పోస్తున్న భరత్..
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి : జానపద కళలను ప్రాణపదంగా మార్చుకొని రంగస్థల వేదికపై తమ ప్రతిభను చాటుతూ ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములును మైమరపిస్తూ..ఒగ్గు కథ జానపదాలకు జీవం పోస్తున్నారు…వివరాల్లోకి వెళ్లితే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన అల్లాడి కొమురయ్య కోమలతల కుమారుడు భరత్ గజ్జె కట్టి గళం విప్పితే వేదిక సందడిగా మారుతుంది.పురాణ చరిత్రలను ఇతిసాహిత్యా సన్నివేశాలను కళ్లకు కట్టినట్టుగా ఒగ్గుకథ రూపంలో చూపించడంలో సిద్ధహస్తుడిగా రాణిస్తున్నాడు. తండ్రి బాటలో తనయుడు అల్లాడి భరత్ డిగ్రి ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తునే ఒగ్గుకథలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఒగ్గుకథ చెబుతూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. తన తండ్రి కొమురయ్య ప్రదర్శించిన ఒగ్గుకథలను చెప్పిన విధానం గమనించిన భరత్ అప్పటినుంచి ఒగ్గుకథపై ఆసక్తి పెంచుకొని తండ్రి బృందంలోనే చేరి స్త్రీ వేషధారణ పాత్రల్లో సుమారు ఇప్పటి వరకు సుమారు వంద వరకు కథలను అనర్గళంగా ప్రదర్శిస్తూ గ్రామస్థులతో భేష్ అనిపించుకుంటున్నాడు. (Story : ఒగ్గు కథకు జీవం పోస్తున్న భరత్..)
( ప్రత్యేక కథనం/ సీనియర్ జర్నలిస్ట్: నారదాసు ఈశ్వర్ )