నీటి సమస్యల్లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి
ధనుర్మాస పూజల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : నీటి సమస్యల్లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నదే తమ స్వప్నమని, నిత్యం దేవుడిని కూడా అదే కోరుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ధనుర్మాస పూజల సందర్భంగా కూడా అదే సంకల్పం చెప్పుకున్నాని, వినుకొండ నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం కావాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. వినుకొండలో ధనుర్మాస పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. విష్ణుసహస్రానామం, లక్ష్మి అష్టోత్తరం, గోవిందా నామాలు సామూహికంగా పారాయణం చేశారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం, త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం, శ్రీకృష్ణ ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ. ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుడిని, అమ్మవారిని దర్శించి విశేష పూజలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తప్పనిసరిగా వినుకొండ, పల్నాడు జిల్లా, ఏపీ, దేశాన్ని శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని, మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలు, కోరికలన్నీ నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం, గోదాదేవి కల్యాణాన్ని విశేషంగా జరపడం అభినందనీయమన్నారు. చినజీయర్ స్వామి ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని, ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. చినజీయర్ స్వామి ఆశ్రమానికి ఎప్పుడూ తన అండదండలు ఉంటాయని, సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. భగవదానుగ్రహానికి అత్యంత అనుకూల సమయం, అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిసిన ధనుర్మాసంలో రాష్ట్ర ప్రజలందరి కోరికలు కూడా నెరవేరని ఆకాంక్షించారు. (Story : నీటి సమస్యల్లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి)